28 August, 2026 | 8:55 PM

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

28-08-2026 07:52 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో విద్యుత్ అమరవీరుల 26వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి హాలవత్ లింగ్యా అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రైవేటు సంస్థల చేతిలో ఉండకూడదని ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలో బషీర్బాగ్ వద్ద పాషవికంగా పోలీసులు కాల్పులు జరపడంతో రామకృష్ణ, విష్ణువర్ధన్ బాలస్వామి తీవ్రంగా గాయపడి మరణించడం జరిగిందని తెలిపారు.

వారి ఆత్మ బలిదానంతో ప్రభుత్వం వెనకకు తగ్గి కరెంటు ప్రైవేటీకరణను మానుకుందని తెలిపారు. ఆ ఫలితంగానే ప్రభుత్వం ఆధీనంలో విద్యుత్ వ్యవస్థ ఉందని తెలిపారు. నేడు రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రయివేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రక్రియ జోరుగా సాగుతుందని, దానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమ స్పూర్తితో ఐక్య ప్రజా ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా కార్యదర్శి బట్టు చైతన్య, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, పి వై ఎల్ ,పి డి ఎస్ యు ప్రజాసంఘాల నాయకులు తెలబోయిన కృష్ణ, షేక్ షబ్బీర్ ఎస్.కె పాషా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.