విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించాలి
వినియోగదారుల హక్కుల మండలి డిమాండ్
ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): విద్యార్థులపై పెరుగుతున్న విద్యా, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని వినియోగదారుల హక్కుల మండలి(సీఅర్‌సీ) డిమాండ్ చేసింది. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఅర్ సీ జాతీయ అధ్యక్షుడు డా.వికాస్ పాండే మాట్లాడారు. విద్యా వాణిజ్యీకరణ, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ విధానాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఅర్ సీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ముజీర్ రోజ్దార్ మాట్లాడుతూ విద్య హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం-2020, సీబీఎస్‌ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒత్తిడి రహిత విద్యా వ్యవస్థను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ బాబు మాట్లాడుతూ చిన్న వయసులోనే పోటీ పరీక్షల ఒత్తిడి మోపడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోందని అన్నారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఐఐటీ-జేఈఈ, నీట్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ను నిషేధించి, విద్యా భారం నియంత్రణ, విద్యా వాణిజ్యీకరణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రతినిధి అవినాష్ బెంజమిన్, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుంజు జోషువా తదితరులు పాల్గొన్నారు.






