16 July, 2026 | 11:07 AM

బ్రిటన్‌లో లేబర్ పార్టీదే ప్రభుత్వం!

04-07-2024 01:25 AM
  • 650లో 484 సీట్లు గెలుచుకుంటుంది 
  • అధికార కన్జర్వేటివ్‌కు 64 సీట్లే వస్తాయి 
  • 14 ఏళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమైంది 
  • ఒపీనియన్ పోల్స్ సర్వేల్లో వెల్లడి

లండన్,జూలై 3: బ్రిటన్ రాజకీయాల్లో మార్పు రాబోతోందని ఎన్నికలకు ముందు ప్రీపోల్ సర్వే లు వెల్లడిస్తున్నాయి. బ్రిటీష్ పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నా యి. 650 స్థానాలకు నిర్వహించే పోలింగ్‌కు ఆ దేశ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈసారి లేబర్, కన్జర్వేటివ్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న భారత సంతతికి చెందిన రుషి సునాక్ నేతృత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఈసారి ఓటమి తప్పదంటూ సర్వేలు చెబుతున్నాయి. 2010 నుంచి అక్కడ కన్జర్వేటివ్ పార్టీనే అధికారంలో ఉంటూ వస్తోంది. 2010లో ప్రధానిగా గార్డన్ బ్రౌన్ గద్దె దిగిన తర్వాత లేబర్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది. 

రికార్డు స్థాయిలో..

తాజా సర్వేలు లేబర్ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బ్రిటన్‌లో గురువారం జరిగే జాతీయ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు సాధిం చి లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందని పోలింగ్ కంపెనీ సర్వే మంగళవారం వెల్లడించింది. కెయిర్ స్టామర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ పార్లమెంటులోని మొత్తం 650 సీట్లకు గాను 484 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోలింగ్ అంచనా వేసిం ది. ఇప్పటివరకు లేబర్ పార్టీ చరిత్రలో గెలిచిన అత్యధిక స్థానాలు 418. అదికూడా 1997లో టోనీ బ్లెయిర్ నాయకత్వంలో ఆ పార్టీ భారీ విజ యం సాధించింది. 14 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్న లేబర్ పార్టీ పక్కాగా అధికారంలోకి వస్తుందని ఇంగ్లండ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

అధికారిక పార్టీపై వ్యతిరేకత

14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి కేవలం 64 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే స్పష్టం చేసింది. ఒకవేళ ఇదే నిజమైతే 1834లో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇదే అత్యల్పం కానుంది. ఆర్థిక సంక్షోభం, అనూహ్య పరిణామాల మధ్యలో యూకే ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రుషి సునాక్ ఈసారి ఎన్నికల్లో సొంత పార్టీని గెలిపించడం కష్టమనే వాదన బ్రిటన్‌లో వినిపిస్తోంది. దశాబ్ద కాలానికిపైగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఎన్నో హామీలను నెరవేర్చకపోవడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, వరుస కుంభకోణాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది.   ఫలితంగా మార్పు నినాదంతో ప్రచారం చేసిన లేబర్ పార్టీకే అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 

లేబర్ సంపూర్ణ విజయం 

మరో మితవాద పార్టీ రీఫార్మ్ యూకే 7 సీట్లు గెలుచుకుంటుందని పోలింగ్ కంపెనీ తన సర్వేలో పేర్కొంది. పోలింగ్ కంపెనీ తన సర్వేను స్థానికం నుంచి జాతీయ స్థాయి వరకు అనేక శాంపిళ్లను సేకరించి అధ్యయనం చేసినట్లు తెలిపింది. ఇతర సర్వేలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. మొత్తం సీట్లకు సంబంధించిన డాటాను మాత్రం విడుదల చేయలేదు. అంతకుముందు పలు సర్వేల ప్రకారం లేబర్ పార్టీ ఆధిక్యానికి సమీపంగా వస్తుందని పేర్కొన్నాయి.

కానీ ప్రస్తుత సర్వేలు లేబర్ పార్టీకి సంపూర్ణ విజయం దక్కుతుందని అభిప్రాయపడుతున్నాయి.  మొత్తంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న సునాక్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ, కెయిర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ హోరాహోరీగా ప్రచారం సాగించాయి. గెలుపుపై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు నిలుస్తారో చూడాలి.

బ్రిటన్ ఎన్నికల వివరాలు ఇలా.. 

బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో ఇంగ్లండ్, నార్త్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాల్లోని 650 స్థానాలకు జూలై 4న పోలింగ్ జరుగుతుంది. మ్యాజిక్ ఫిగర్ 326 సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. యూకేలో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు చూపించాలనే నిబంధనను ఆ దేశ చరిత్రలో మొదటిసారి ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్ ఉన్నవారికీ ఈసారి ఓటు హక్కు కల్పించారు. యూకే పోలింగ్‌లో 18 లక్షల మంది భారతీయులు పాల్గొననున్నారు. పోలింగ్ పూర్తి కాగానే లెక్కింపు ప్రారంభిస్తారు. జూలై 5వ తేదీ ఉదయమే ఫలితాలు విడదల చేసే అవకాశముంటుంది. జూలై 9న కొత్త పార్లమెంటు కొలువుదీరుతుంది.