2 April, 2026 | 3:16 AM

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

02-04-2026 12:00 AM
  1. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలి
  2. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీల దీక్షలు

ఉట్నూర్, ఏప్రిల్ 01 (విజయక్రాంతి) :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్ ను పకడ్బందీగా అమలు చేయవలసిన బాధ్యత  ప్రభుత్వ అధికారులపై ఉందని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజనుల అమరవీరుల స్మారక స్తూపం వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఆదివాసి గిరిజనులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేస్తుంటే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మించడంతో పాటు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని  ఆరోపించారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గత ఏడాది ఏప్రిల్ లో కుటుంబాలకు ట్రాక్టర్లు మంజూరు చేసి మూడు నెలలకే తిరిగి తీసుకున్నారని గుర్తు చేశారు.

తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించడంతో వారంరోజుల క్రితం తిరిగి ట్రాక్టర్లు అప్పగించారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి లంబాడాలు వలస వస్తున్నారని, ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో  9 తెగల ఆదివాసులు డిమాండ్ చేస్తున్న వలసలు తగ్గడం లేదని ఆరోపించారు. వెం టనే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవం తర్వాత ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని  ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని అన్నా రు. ఈ నిరసనలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పూర్కా బాపూరావు, జిల్లా అధ్యక్షుడు పెందుర్తి దాదేరావు, ఇంద్రవెల్లి అమరవీరుల సాధన కమిటీ అధ్యక్షుడు మెస్రం నాగనాథ్, ఆదివాసీ నాయకుడు ఆర్క కమ్ము, రాయి సెంటర్ల సార్ మేడిలు, గ్రామాల పటేళ్లు, మహిళా ప్రతినిధులు, ఆదివాసి ఉద్యమ నాయకులు  పాల్గొన్నారు.