20-12-2025 01:10:03 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 19 : సాహెబ్ నగర్ పరిధిలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ భూమి అటవీశాఖదేనని, సుప్రీంకోర్టు కోర్టు ఇచ్చిన తీర్పు అటవీ భూముల సంరక్షణకు దోహదం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఫారెస్ట్ అధికారి శరవనణ్ అన్నారు. అటవీ సంరక్షణలో రాష్ట్ర నిబద్ధత పాత్రను సుప్రీం కోర్టు సమర్ధించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం గుర్రంగూడ అటవీ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ గుర్రంగూడ భూమిపై హక్కుల కోసం 1953 నుంచి కేసు నడుస్తుందన్నారు. గుర్రంగూడలో 201/1 సర్వే నెంబర్ లో 102 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉందని తెలిపారు. 102ఎకరాల భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో భాగమేనని అది రాష్ట్ర ప్రభుత్వ అటవీ భూమేనని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందన్నారు. నోటిఫై చేసిన అటవీ భూములపై చాలా ఆలస్యంగా ప్రవేట్ హక్కుల పేరిట దాఖలు చేసే దావాలు చట్టబద్ధంగా లేవని కూడా కోర్టు తేల్చిచెప్పిందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 48ఏ (జీ) ప్రకారం అటవీ భూములు జాతీయ సంపద అని, అటవీ భూములను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొందన్నారు.
అటవీ శాఖ తీసుకున్న చర్యలు అటవీ చట్టానికి, పర్యావరణ పరిరక్షణ సూత్రాలకు అనుగుణంగా ఉందని ఫారెస్ట్ అధికారి శరవణ్ పేర్కొన్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తరుపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, జస్టిస్ (రిటైర్డ్) చల్ల కోదండరాం, అదనపు సాలిస్టర్ జనరల్ ఐశ్వర్య బాటి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ కరణం శ్రవణ్ కుమార్లంకు అటవీ శాఖ అధికార్లు కృతజ్ఞతలు తెలిపారు, క్షేత్రస్తాయి సిబ్బంది అనేక సంవత్సరాలుగా చేసిన నిరంతర కృషి వల్లే ఈ కీలక తీర్పు సాధ్యమైందని చీఫ్ ఫారెస్ట్ అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ కోపిడి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ అధికారులను సత్కరించిన కార్పొరేటర్ లచ్చిరెడ్డి
సాహెబ్ నగర్ కలాన్ రెవెన్యూ పరిధిలోని 201/1 సర్వే నెంబర్ లో ఉన్న 102 ఎకరాల భూమి గుర్రం గూడా రిజర్వ్ ఫారెస్ట్ లోని భాగమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించినందుకు గుర్రంగూడలోని అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదేనన్నారు. ఫారెస్ట్ భూమిలో కొంత భాగం ప్రజల ఆరోగ్యం కోసం అభివృద్ధి చేయాలని, అందులో పార్కును వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను కోరారు.
కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కస్నా నాయక్, బీఎన్ రెడ్డి నగర్ కాలనీ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, వైదేహి నగర్ కాలనీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చైతన్య నగర్ కాలనీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.