12 June, 2026 | 1:53 AM

పేదల భూమిని కబ్జాకోరుల నుండి కాపాడాలి

12-06-2026 12:40 AM
  1. 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కాంగ్రెస్ నేతల కుట్రలు
  2. దీనికి ఎమ్మెల్యే నాయిని సమాధానం చెప్పాలి
  3. ఈ స్థలాన్ని ఐటీఐ, జూనియర్ కాలేజీ, ఆస్పత్రి లేదా ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలి
  4. పేదలకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే పోరాటాలు చేస్తాం
  5. బీజేపీ రాష్ట్ర నాయకురాలు పద్మ 

హనుమకొండ, జూన్ 11,(విజయ క్రాంతి):కాజీపేట మండల కేంద్రంలోని వైఎస్సార్ నగర్ గుడిసెవాసులను బెదిరించి, దాదాపు 300రూపాయల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ రెడ్డి విమర్శించారు. గురువారం నాడు కాజీపేట బిజెపి నాయకులతో కలిసి వైయస్సార్ నగర్ సందర్శించి అక్కడి గుడిసేవాసులతో కలిసి మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా రావు పద్మ రెడ్డి మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ నగర్ లోని పేద ప్రజలు గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థలాన్ని కాపాడుకుంటున్నారని గుర్తుచేశారు.అలాంటి విలువైన ప్రభుత్వ భూమిని కార్పొరేట్ శక్తులకు, కాంగ్రెస్ అనుచరులకు, అలాగే భూకబ్జా కేసుల్లో జైలు శిక్ష పడి ప్రస్తుతం బెయిల్ పై వచ్చిన కబ్జాదారులకు కట్టబెట్టాలని చూస్తే, చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

ఈ మొత్తం వ్యవహారానికి స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయకుండా, ప్రజల అవసరాల కొరకు ఐటీఐ,ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఆస్పత్రి లేదా ఏసీపీ ఆఫీస్ లాంటి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల కోసమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. పేదలను దోచి పెద్దలకు కట్టబెడతాం అంటే సహించేది లేదు అని ఆమె స్పష్టం చేశారు.వైఎస్సార్ నగర్ లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద ప్రజలకు వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఇక్కడి అర్హులకు ప్రభుత్వ ఖర్చుతో పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

బలవంతంగా లేదా మోసపూరిత హామీలతో పేదలను ఇక్కడి నుండి ఖాళీ చేయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి పేదలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో బాధితులను కలుపుకొని బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున క్షేత్రస్థాయి పోరాటాలు,ఆందోళనలు ఉధృతం చేస్తామని రావు పద్మారెడ్డి హెచ్చరించారు.ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి జిల్లా నేతలు ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు, తోపుచర్ల అర్చన, స్థానిక బిజెపి నాయకులు కాయిత రాజ్ కుమార్, మేకల శ్రావణ్, రేణుకుంట్ల కల్యాణ్, తిరుపతి నాయక్, భగవాన్ ఉపాధ్యాయ, ఆదిత్య సాయి, చాంద్ పాషా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.