10 July, 2026 | 2:51 AM

ప్రైవేట్ స్కూళ్ల పుస్తకాల దోపిడీ

10-07-2026 01:15 AM

ఫీజులు ఒకటి.. పుస్తకాల భారం మరొకటి

ఖమ్మంలో తల్లిదండ్రులపై అదనపు వసూళ్ల మోత

అధికారుల మౌనంతో యాజమాన్యాల ఇష్టారాజ్యం

ఖమ్మం ఎడ్యుకేషన్, జులై 9 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడి రోజురోజుకూ మితిమీరుతోంది. ఒకవైపు అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, బస్ ఫీజులు, టర్మ్ ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తుండగా, మరోవైపు పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫాంలు, షూస్, బ్యాగులు, ఇతర విద్యా సామగ్రి పేరుతో అదనపు భారం మోపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లల చదువు పేరుతో ఏది చెప్పినా చెల్లించక తప్పని పరిస్థితి నెలకొనడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లా కేంద్రం నుంచి మండలాల వరకు అనేక ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే పరిస్థితి కనిపిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

అడ్మిషన్ సమయంలో ఒక ఫీజు జాబితా ఇస్తూ, ఆ తర్వాత పుస్తకాల సెట్ తప్పనిసరిగా పాఠశాల ద్వారానే కొనాలని ఒత్తిడి తీసుకొస్తు న్నారని ఆరోపిస్తున్నారు. మార్కెట్లో తక్కువ ధరలకు లభించే పుస్తకాలు, నోట్బుక్లను పాఠశాలల పేరుతో రెండింతలు, మూడింతలు ధరలకు విక్రయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రెండో, మూడో తరగతి విద్యార్థులకే పుస్తకాల కోసం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు, యూనిఫాంలు కలిపితే రూ.10 వేల వరకు ఖర్చు అవుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పై తరగతులకు వెళ్తే ఈ మొత్తం మరింత పెరుగుతోందని చెబుతున్నారు.

కొన్ని పాఠశాలల్లో పుస్తకాల విక్రయాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, బయట కొనకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్ చెప్పిన దుకాణం నుంచే కొనాలని ఒత్తిడి చేయడం, వేరే చోట కొనుగోలు చేసినా అంగీకరించకపోవడం, అదే స్కూల్ ముద్ర ఉన్న నోట్బుక్లు తప్పనిసరిగా కొనాలనడం వంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతో చాలా కుటుంబాలు నోరు మెదపలేక మౌనంగా భారం మోయాల్సి వస్తోందని అంటున్నారు.

ఫీజుల వ్యవహారంలో కూడా యాజమాన్యాల ఇష్టారాజ్యం నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్యూషన్ ఫీజుతో పాటు అడ్మిషన్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, డిజిటల్ క్లాస్ ఫీజు, పరీక్ష ఫీజు, భవన నిర్వహణ ఫీజు అంటూ పేర్లు మార్చి వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే సంవత్సరానికి పదుల వేల రూపాయలు ఖర్చు అవుతోందని, ఇద్దరు పిల్లలు ఉంటే కుటుంబ బడ్జెట్ పూర్తిగా కుదేలవుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్య హక్కు అయినా, ప్రైవేట్ పాఠశాలల్లో అది ఖరీదైన భారంగా మారిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందల సంఖ్యలో పాఠశాలలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, పెద్ద గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రైవేట్ పాఠశాలలే అధికంగా ఉండటంతో తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయాలు తగ్గిపోతున్నాయి. ఇంగ్లిష్ మీడియం, మంచి ఫలితాలు, క్రమశిక్షణ, ప్రత్యేక శిక్షణ పేర్లతో విద్యార్థులను ఆకర్షిస్తున్న పాఠశాలలు, ఫీజుల నియంత్రణ విషయంలో మాత్రం ఎలాంటి పారదర్శకత పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పాఠశాలల మధ్య పోటీ పెరిగిన కొద్దీ ఫీజుల వసూళ్లు, పుస్తకాల వ్యాపారం కూడా పెరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

తల్లిదండ్రుల వేదన ఇక్కడితో ఆగడం లేదు. ఫీజులు ఆలస్యమైతే పిల్లలను అవమానించేలా ప్రవర్తించడం, పరీక్షలకు అనుమతించమని హెచ్చరించడం, క్లాస్లో ఇబ్బంది పెడతారన్న భయంతో చాలామంది ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడుతున్నారని తెలుస్తోంది. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఇష్టం లేకపోతే మరో స్కూల్ చూసుకోండి అన్న ధోరణి కూడా కనిపిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. పిల్లల చదువు ఆగిపోతుందనే భయంతో తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతూ కూడా మౌనంగా చెల్లింపులు చేస్తున్నారని అంటున్నారు.

ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజులు, పుస్తకాల విక్రయాలు, యూనిఫాం దందాపై ఫిర్యాదులు వచ్చినా, కఠిన చర్యలు తీసుకున్న ఉదాహరణలు చాలా అరుదుగా ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పాఠశాలలు పుస్తకాలు బలవంతంగా విక్రయించకూడదు, ఒకే చోట కొనాలని ఒత్తిడి చేయకూడదు, ఫీజుల నిర్మాణం పారదర్శకంగా ఉండాలి.

కానీ నేలస్థాయిలో మాత్రం ఈ నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో అధికారుల నిర్లక్ష్యంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడిగే వారు లేరన్న ధీమాతోనా, లేక అధికారుల అండ ఉందన్న నమ్మకంతోనా కొందరు యాజమాన్యాలు బహిరంగంగానే దోపిడీ కొనసాగిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండదనే భావన తల్లిదండ్రుల్లో బలపడుతోంది.

కొందరు పాఠశాలల యాజమాన్యాలకు రాజకీయ, ఆర్థిక, అధికార వర్గాల మద్దతు ఉండటంతోనే ఎలాంటి భయం లేకుండా వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్మాణం, పుస్తకాల విక్రయాలు, యూనిఫాం కొనుగోళ్లు, బలవంతపు వసూళ్లపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి పాఠశాల ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించేలా చేయాలని, స్కూల్ ప్రాంగణాల్లో పుస్తకాల వ్యాపారం నడిపే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసి, బాధిత తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లల చదువు పేరుతో తల్లిదండ్రుల బలహీనతను డబ్బుగా మార్చుకోవడం ఆందోళనకరమని జిల్లా ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ మేల్కొని ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడి, పుస్తకాల వ్యాపారం, యూనిఫాం వసూళ్లపై ఉక్కుపాదం మోపకపోతే సామాన్య కుటుంబాలపై భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.