తిరిగి ఒడిదుడుకుల్లో మార్కెట్
బలహీన అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు కారణం
ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు
ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
న్యూఢిల్లీ, జూన్ 11: ఆర్థిక మంత్రిగా తిరిగి నిర్మాలా సీతారామన్‌తో పాటు పలు కేంద్ర క్యాబినెట్ మంత్రులు బాధ్యతలు చేపట్టిన మంగళవారం అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యింది. కొద్ది రోజులుగా జరిగిన రికార్డు ర్యాలీలో వచ్చిన లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ఇంట్రాడే గరిష్ఠస్థాయి నుంచి స్టాక్ సూచీలు వెనుకంజవేసి దాదాపు ఫ్లాట్‌గా ముగిసాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 370 పాయింట్లు ఎగిసి 76,860 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరిన తర్వాత చివరకు 33 పాయింట్ల స్వల్పనష్టంతో 76,457 పాయింట్ల వద్ద ముగిసింది. ముగింపు సమయంలో 230 పాయింట్ల నష్ఠాన్ని సైతం చూసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 130 పాయింట్లు ర్యాలీ జరిపి 23,389 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. 23,206 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన తర్వాత చివరకు 5 పాయింట్ల స్వల్పలాభంతో 23,264 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యోలు పెరగ్గా, షాంఘై, హాంకాంగ్‌లు తగ్గాయి. యూరప్‌లో ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు నష్టాలతో ముగిసాయి. కడపటి సమాచారం అందేసరికి యూఎస్ మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి.
ఫెడ్ వడ్డీ రేట్ల పట్ల ఆందోళన
ఎన్నికల ఫలితాల రోజున జరిగిన తీవ్ర పతనం నుంచి శరవేగంగా రిబౌండ్ అయి దేశీయ మార్కెట్ స్థిరపడిందని, తదుపరి ట్రిగ్గర్ల కోసం వేచిచూస్తున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుతో ఇన్వెస్టర్ల దృష్టి అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంకేతాలవైపు మళ్లిందని, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గవన్న ఆందోళనలు మొదలయ్యాయని వివరించారు. ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ నిర్ణయాల కోసం, యూఎస్, భారత్‌ల నుంచి వెలువడే కీలక ఆర్థిక గణాంకాల కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారన్నారు.






