డాక్యుమెంట్లు కోరుతూ క్లెయింలు తిరస్కరించరాదు
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు
న్యూఢిల్లీ, జూన్ 11: సాధారణ బీమా కంపెనీలు డాక్యుమెంట్లు సమర్పించమని కోరుతూ క్లెయింలు తిరస్కరించవీలులేదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) మంగళవారం ఒక సర్క్యులర్ జారీచేసింది. సాధారణ బీమా వ్యాపారం సంస్కరణల్లో భాగంగా విడుదల చేసిన మాస్టర్ సర్క్యులర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
‘డాక్యుమెంట్ల కోసం ఏ క్లెయిం తిరస్కరించరాదు. బీమా ప్రతిపాదనను స్వీకరించినపుడే అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ పాలసీదారు నుంచి తీసుకోవాలి. క్లెయిం సెటిల్‌మెంట్ కోసం (క్యాష్‌లెస్ కాకపోతే) అవసరమైతే ఆ డాక్యుమెంట్లనే సమర్పించమని ఖాతాదారును కోరవచ్చు’ అని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌లో పేర్కొంది.
ఎప్పుడైనా పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు
రిటైల్ ఖాతాదారులు వారి పాలసీని బీమా కంపెనీకి తెలియపర్చి, ఎప్పుడైనా పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది. మోసం జరిగిందని రుజువైతేనే బీమా సంస్థ పాలసీని రద్దు చేయాలని పేర్కొంది. ఖాతాదారు పాలసీని క్యాన్సిల్ చేసుకుంటే, మిగిలిఉన్న కాలానికి నిర్దేశించిన ప్రీమియం మొత్తాన్ని బీమా సంస్థ రిఫండ్ చేయాలని సర్క్యులర్‌లో వివరించింది. సర్వేయిర్ల నియామకం, వారి నివేదికల సమర్పణలతో సహా క్లెయింల సెటిల్‌మెంట్‌కు కఠినమైన సమయపాలనను సైతం ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. సర్వే రిపోర్టులను సమయానికి తెప్పించుకోవడం బీమా సంస్థ బాధ్యత అని పేర్కొంది. మోటారు ఇన్సూరెన్స్‌లో ‘పే యాజ్ యూ డ్రైవ్/పే యాజ్ యూ గో’ అనే అదనపు ఆప్షన్లను ఖాతాదారుకు తొలి ఛాయస్‌గా ఇవ్వాలని సర్యులర్‌లో ఆదేశించింది.
‘ఫైర్’ పాలసీకి సంబంధించి వరదలు, తుఫాను, భూకంపం, ఉగ్రవాదం తదితరాల యాడ్ ఆన్ కవర్స్‌ను ఎంపికచేసే ఆప్షన్‌ను గృహ యజమానులకు ఇవ్వాలని సూచించింది. పాలసీ వివరాలను సమగ్రంగా తెలియపరుస్తూ పాలసీదారుకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ను బీమా సంస్థలు ఇవ్వాలని, కవరేజ్, మినహాయింపులు, వారెంటీలు, క్లెయిం సెటిల్‌మెంట్ ప్రక్రియ వంటివన్నీ అందులో పొందుపర్చాలని ఆదేశించింది. గతంలో జారీచేసిన 13 సర్క్యులర్లలో ఆదేశాలను పొందుపరుస్తూ ఐఆర్‌డీఏఐ తాజాగా సమగ్ర మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది.






