22 April, 2026 | 1:36 AM

మోడల్ కాలనీ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి

22-04-2026 12:07 AM

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేత

పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

హుజూర్ నగర్, ఏప్రిల్ 21: పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇండ్లను త్వరతగతిన పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని మోడల్ కాలనీలను పరిశీలించి మాట్లాడారు.

రామ స్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 2,160  ఇందిరమ్మ ఇండ్ల  మోడల్ హౌసింగ్ కాలనీని రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, గ్రీనరీ, త్రాగునీరు, పైలాన్ స్తూపం  స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హత లేని వారికి జాబితాలో పేరు ఉండకూడదని తెలిపారు. అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి  ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు  హౌసింగ్ పీడీ సిద్ధార్థ,హర్టికల్చర్ పిడి నాగయ్య, తహసిల్దార్ కవిత, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.