5 April, 2026 | 5:34 AM

మహనీయుల జయంతి మాసం

05-04-2026 12:00 AM

సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటరానితనం, కుల వివక్షత నిర్మూలనతో పాటుగా విద్య కోసం నిరంతరం పోరాటమే వారి జీవితం. ఆ మహానుభావు ల పోరాటం వారి ఉద్యమ స్ఫూర్తి నేటి తరాలకు ఒక దిక్సూచిగా మార్గదర్శకంగా నిలుస్తోంది. అణగారిన వర్గాల అభ్యున్నతే అంతిమ లక్ష్యంగా అడుగు లేసిన ఆ మహానుభావులు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయ సాధన కోసం కృషి జరుగుతోంది. ఆ మహానుభావులే బాబు జగ్జీవన్‌రామ్, జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్.

వీరు ముగ్గురు ఏప్రిల్ మాసంలోనే జన్మించడం విశేషం. ప్రతి యేటా ఆ మహానుభావుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకే ఏప్రిల్ మాసాన్ని మహనీయుల జయంతి మాసంగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన భారత రాజ్యాంగ నిర్మాతగా,  దళిత జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేసిన గొప్ప వ్యక్తిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయాడు.

ఇక 40 ఏళ్ల పాటుగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో పనిచేసి  కేంద్ర మంత్రిగా, భారత ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్‌రామ్ విశేష సేవలందించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తూనే సంఘ సంస్కకర్తగా, వితంతు వివాహాల కోసం పోరాటం చేసిన జ్యోతిబా పూలే నేటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు మహానుభావులుగా వారి సేవలను గుర్తుచేసుకుంటూ ఏప్రి ల్ 5వ తేదీ నుంచి 14 వరకు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

బాబు జగ్జీవన్ రామ్ బీహార్‌లోని చాంద్వాలో 1908 ఏప్రిల్ 5 వ తేదిన జన్మించారు. సంఘసంస్కర్త రాజకీయవేత్త, స్వతంత్ర సమరయోధుడు భారత పార్లమెంట్‌లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులను నిర్వహించిన ఘన త ఆయనకే దక్కింది. 1940లో సత్య గ్రహం ఉద్యమంలో పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించాడు. 1977 నుంచి 1979 వరకు మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో జగ్జీవన్ రామ్ ఉపప్రధానిగా పని చేశాడు.

జ్యోతిబాపూలే మహారాష్టలో 11 ఏప్రిల్ 1827లో  జన్మించారు. కుల వ్యవస్థ నిర్మూలనతో పాటుగా మహిళోద్దరణకు కృషి చేశాడు.  తన మిత్రులతో కలిసి సత్యశోధకు సమాజ్ ఏర్పాటు చేశారు. బాలికల కోసం 1848లో పూణేలో తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మొదటి పాఠశాలను ప్రారంభించారు. పూలే సామాజిక సేవలకు గుర్తింపుగా 1888లో ’మహాత్మా’ బిరుదు లభించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లోని మౌ (ప్రస్తుత అంబేద్కర్‌నగర్)లో ఏప్రిల్ 14 , 1891లో జన్మించాడు.

ఆయన పాఠశాల చదువుల నుంచే సమాజంలో కుల వివక్షతకి గురయ్యారు. అనేక అవమానా లు భరించాడు. ప్రపంచంలోనే ఉన్నతమైన చదువులు చదివి అనేక పట్టాలు పొందాడు. భారత రాజ్యాంగ నిర్మాతగా,  స్వతంత్ర భారత మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారు. 1990లో భారతరత్న లభించింది. 

భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా వ్యవహరించి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పాత్ర కీలకం. ఆనాటి నుంచి నేటి వరకు దేశంలోని ప్రతి రాజకీయ పార్టీపై అంబేడ్కర్ ప్రభావం ఉంది. బాబు జగ్జీవన్‌రామ్, జ్యోతిబాపూలే, అంబేద్కర్ వంటి మహానుభావుల ఆశయాలను  ముందుకు తీసుకువెళ్లడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మేధావులపై ఎంతైనా ఉంది.  

 వేకువ