బెంగాల్ ఉద్రిక్తతలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు ప్రత్యేక సవరణ (సర్)తో కొంతకాలంగా ఎన్నికల కమిషన్, మమత బెనర్జీ ప్రభుత్వం మధ్య జగడం కొనసాగుతున్నది. ఓటర్ల జాబితా నుంచి అనేకమందిని, వివిధ కారణాలతో తొలగించడమే ‘సర్’ ఉద్దేశ్యమని, ఇది కుట్రపూరితంగా జరుగుతున్న ప్రక్రియ అని మమత బెనర్జీ ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మాల్దా జిల్లాలో జరిగిన ఘటన ‘సర్’ విషయంలో ఉద్రిక్తలకు దారితీసింది.
‘సర్’ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారన్న ఆగ్రహంతో మాల్దా జిల్లాలోని మోతాబరిలో గ్రామస్తులు అధికారులను బంధీ చేశారు. ఇలా ముగ్గురు మహిళా అధికారులు సహా ఏడుగురు న్యాయాధికారులను గ్రామస్తులు తొమ్మిది గంటలకుపైగా గదిలో వేసి ఉంచారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేసేందుకు, ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రగా అభివర్ణించింది.
ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ఇది కొద్ది రోజుల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా పెను సంచలనంగా మారింది. నిందితులను అరెస్టు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది. మోతాబరిలో ఏడుగురు న్యాయాధికారులపై దాడికి యత్నించారని పోలీసులు ఇప్పటివరకు 35 మందిని అరెస్టు చేశారు. న్యాయధికారులను బంధీచేసిన ఘటనతో తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధం లేదని, ‘సర్’పై వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలపై తనేం చేయలేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.
నిజానికి మోతాబరిలో నిరసనలకు నాయకత్వం వహించింది ఏఐఎంఐఎంతో సంబంధమున్న ముఫఖ్ఖరుల్ ఇస్లాం అనే న్యాయవాది అని తేలింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్లాం ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. దీనితో ఈ ఘటనకు బీజేపీ, ఏఐఎంఐఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌లే కారణమని మమత ఆరోపిస్తున్నారు. అరెస్టయిన వారిలో ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్‌కు చెందిన మోతాబరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మౌలానా మొహమ్మద్ షాజహాన్ ఆలీ ఖాద్రీ, ఆయన ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
ఈ ఘటనతో ఏప్రిల్ 23, 29న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. 294 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 120 స్థానాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంటుంది. పశ్చిమబెంగాల్‌లో ఉన్న 27 శాతం ముస్లిం జనాభా మొదటి నుంచి ఎన్నికలు నిర్ణయాత్మకమే. మాల్దా ఘటనను ప్రచారాస్త్రంగా చేసుకున్న మమత, తాను మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ఏఐఎంఐఎం, బీజేపీల మధ్య ఉన్న బంధం బయటపడిందని ఆరోపిస్తున్నారు.
బెంగాల్ లో బీజేపీకి మద్దతుగా ఈ ఎన్నికల్లో ఏఐఎంఐఎం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నందని ఆమె చెబుతున్నారు. ఏఐఎంఐఎంపై ఇప్పటికే ఉన్న ఆరోపణల్ని మమత ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే, సీఐడీ అరెస్టు చేసిన ఇస్లాంకు గతంలో తృణముల్‌తో సంబంధాలున్నాయని, మాల్దా ఘటన తృణమూల్ వ్యూహమేనని బీజేపీ ఆరోపిస్తున్నది.




