calender_icon.png 21 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ ఇచ్చిన నోటీసు ఓ ట్రాష్

21-01-2026 12:49:00 AM

  1. ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం?

  2. నేను హోంమంత్రిగా చేయలేదు

నన్ను అడగడం కాదు...నేనే వారిని చాలా ప్రశ్నలు అడిగా

ఫోన్లు రాగానే బయటికి వెళ్లి మళ్లీ వచ్చి అడిగిందే అడిగారు

సీఎం ఫోన్ చేశారో? లేక సజ్జన్నార్ చేశారో?

అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పా

మంత్రుల వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్టు అట్టు పొట్టు

జరిగిన విచారణ మొత్తం రికార్డు బయట పెట్టాలి

మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసంతా ఒక ట్రాష్ అని, ఫోన్ ట్యాపింగ్‌తో తనకేం సంబంధమని, తాను హోంమంత్రిగా చేయలేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. నన్ను ప్రశ్నలు అడగడం కాదు...తానే సిట్ అధికారులకు చాలా ప్రశ్నలు అడిగానని చెప్పారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని విచారణకు పిలవాలని కోరానన్నారు. 

ఇదంతా మంత్రుల వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే తనపై సిట్ విచారణ అని విమర్శించారు. మంగళవారం సిట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. నిరాధార ఆరోపణలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణమన్నారు.

అధికారులకు గంట అడగగానే బయటి నుంచి ఫోన్లు వస్తయి, మల్లా గంట తరువాత వస్తారన్నారు. ఫోన్లు వస్తే ముగ్గురు బయటికి పోయి వచ్చి మల్లా ప్రశ్నలు అడిగారని, రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండో, సజ్జనర్ చేసిండో అని అనుమానం వ్యక్తం చేశారు. ఒక ప్రైవేటు కేసులో కోట్లు ఖర్చు చేసి నన్ను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.  

హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

నీకు దమ్ము, ధైర్యం ఉంటే, తప్పు చేయకుంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీ బామ్మర్దే మొదటి దోషి.. అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రింగ్ కింగ్ మీ బామ్మర్దిపై ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని సీఎంకు సవాల్ విసిరారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య కొట్లాట బయట పడిందని, టెండర్ల కోసం చేస్తున్న అంతా తెలుస్తున్నదని ఆయన ఆరోపించారు. దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు అట్టు పొట్టు అని విమర్శించారు.  ఎన్ని సిట్‌లు వేసుకున్నా...తమకు ఉద్యమాలు పోరాటాలు అరెస్టులు కొత్త కాదన్నారు.

కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయే వాళ్లం కాదన్నారు. రుణమాఫీ ఏది అంటే యాదాద్రిలో కేసు, ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటే మానకొండూరులో కేసు, ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడో కేసు పెట్టారని విమర్శించారు. ఘోష్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ అంతా డొల్ల అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించానని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి స్కాంలకు తెగబడ్డారని, దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల వెనుక దాక్కుని పిరికిపందలా నోటీసులు పంపడం కాదు...దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో..ఎన్ని కేసులు పెట్టినా హరీశ్‌రావు గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుందన్నారు. మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని, కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండు రేవంత్ అని సవాల్ చేశారు. ‘కాస్కో రేవంత్.. నేను కుంభకోణాలు కుండబద్దలు కొట్టినట్లు బయట పెడుతూనే ఉంట...లీకులు ఇవ్వడం కాదు..

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ మొత్తం రికార్డు బయట పెట్టు.. అంతేగానీ చేతగాని వాడిలా లీకులు ఇచ్చి చిల్లర రాజకీయాలు చేయకు’అని కీలక వ్యాఖ్యలు చేశారు. నోటీసులతో మీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావని, సింగరేణిలో జరిగిన కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే మీ బామ్మర్ది నువ్వు చేసిన కుంభకోణం, అవినీతి జరిగింది.. నిజం అని భావిస్తామన్నారు. రెండేళ్లలో వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనే.... నీ బామ్మర్ది బొగ్గు కుంభ కోణంపై, అవినీతిపై విచారణ జరిపిస్తాం, అంతా కక్కిస్తామని హెచ్చరించారు.