calender_icon.png 21 January, 2026 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనదేవతలను దర్శించుకున్న ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

21-01-2026 12:49:40 AM

మేడారం, జనవరి 20 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు అమ్మవార్లకు ఎత్తు బంగారం (బెల్లం) మొక్కు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లతో మేడారంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. అడవి తల్లుల చరిత్రను చా టి చెప్పేలా, కోయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా అనేక శిల్పాలు, బొమ్మలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.

ఒకప్పుడు జాతర సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారని, ప్రస్తుతం ఏడాది పొడవునా భక్తులు వస్తుండటంతో శాశ్వత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నూతన వైభవాన్ని సంతరించుకుందన్నారు. వెయ్యి సంవత్సరాల పాటు నిలిచిపోయేలా గద్దెల ప్రాంగణాన్ని ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే వి ధంగా పునర్నిర్మాణం చేయడం మహా అద్భుతంగా ఉందని కొనియాడారు. మేడారం మహా జా తరను ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన బిడ్డల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వ వివక్ష

ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఉత్తరాది ఆలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కోట్లాది మంది ప్రజలు, గిరిజనుల దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారానికి మాత్రం నామమాత్రపు నిధులు కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని అన్నారు.మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది గిరిజన సంస్కృతిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వివక్షను వీడి, కోట్లాది ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.