మియాపూర్ మున్సిపల్ సర్కిల్‌లో ఔట్‌సోర్సింగ్ చక్రవర్తి!
- 26 ఏళ్లుగా ఒకేచోట విధులు
- అధికారులంతా ఇతని కనుసైగల్లోనే
- ఆపరేటర్ తలుచుకుంటే అధికారులే బదిలీ?
- సర్కిల్ 48లో విస్తూపోయే నిజాలు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): అతను ఒక సాదాసీదా ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్. కానీ, అతని కనుసన్నల్లో కోట్లాది రూపాయల బిల్డింగ్ పర్మిషన్లు నడుస్తాయి. అతను చెబితేనే ఫైల్ కదులుతుంది.. అతను కాదం టే అనుమతులు ఆగిపోతాయి.
సై బరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (మియాపూర్ సర్కిల్-48) టౌన్ ప్లానింగ్ విభాగంలో గడిచిన పాతికేళ్లుగా సాగుతున్న ఈ ‘అనధికార ఆఫీసర్’ పెత్తనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారుల మౌనం వెనుక ఉన్న కోట్లాది రూ పాయల ముడుపుల మతలబుపై బాధితులు గళమెత్తుతున్నారు.
26 ఏళ్ల ’శాశ్వత’ సామ్రాజ్యం!
1999లో సాధారణ ఉద్యోగిగా చేరిన ఇతను, ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా, పదుల సంఖ్యలో కమిషనర్లు మారినా తన సీటును మాత్రం వదల్లేదు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి ఉద్యోగుల రొటేషన్ జరగాలి. కానీ, ఈ అపరేటర్‌కు ఏ రూల్స్ వర్తించవు. సర్కిల్‌లోని ప్రతి అంగుళం, ప్రతి అక్రమ నిర్మాణం ఇతని అరచేతిలోనే ఉండటం గమనార్హం.
వసూళ్ల ‘రేటు కార్డు’.. అక్రమాల మోడస్ ఆపరేటర్..
ఈ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇక్కడ నడుస్తున్న ‘సిండికేట్’ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సెల్లార్ నుంచి మొదలుకొని అదనపు ఫ్లోర్ల వరకు స్లాబ్ రేట్లు ఫిక్స్ అయ్యాయి. డీసీ నుంచి వర్క్ ఇన్‌స్పెక్టర్ వరకు వాటాలు చేరవేసే బాధ్యత ఇతనిదే.
సాఫ్ట్‌వేర్ మాయాజాలం..
మామూళ్లు ముట్టజెప్పని బిల్డర్ల ఫైళ్లను ‘సర్వర్ ప్రాబ్లం’ నెపంతో సాఫ్ట్‌వేర్‌లోనే ఫ్రీజ్ చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. రికార్డుల్లో నోటీసులు జారీ చేసినట్లు చూపి, వాటిని ముందే బిల్డర్లకు చేరవేసి కూల్చివేతల నుంచి తప్పిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎదురు తిరిగితే ‘బదిలీ’ వేటు!
ఈ అపరేటర్ అక్రమాలను ప్రశ్నించిన ఉన్నతాధికారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాజకీయ అండదండలతో, తప్పుడు ఫిర్యాదులు చేయించి గత ఐదేళ్లలో ముగ్గురు ఏసీపీలు, ఇద్దరు టీపీఎస్‌లను ఇక్కడి నుంచి పంపించారంటే ఇతని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
అధికారుల మౌనం.. ‘కుమ్మక్కు’కు సంకేతమా?
డిప్యూటీ కమిషనర్ డీ శశిరేఖకు ఫిర్యాదు చేసినా, చర్యల హామీ కేవలం మాటలకే పరిమితమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు సైతం అపరేటర్‌కు లీక్ అవ్వడం వెనుక ‘యాజమాన్య-అపరేటర్’ కుమ్మక్కు స్పష్టంగా కనిపిస్తోందని స్థానిక ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిఘా సంస్థలు ఎక్కడ? విజిలెన్స్ విభాగానికి కళ్ళు లేవా? పదేళ్లలో ఒక్క ఆడిట్ కూడా ఎందుకు జరగలేదు? ఏసీబీ నిఘా ఏమైంది? ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బినామీ ఆస్తులు, బ్యాంక్ లావాదేవీలపై దర్యాప్తు ఎందుకు లేదు? రొటేషన్ నిబంధన ఏది? 26 ఏళ్లుగా ఒకే వ్యక్తిని ఒకే సెక్షన్‌లో ఎలా కొనసాగిస్తున్నారు?
సదరు ఆపరేటర్‌ను తప్పించాలి..
2015 నుంచి జరిగిన అన్ని బిల్డింగ్ పర్మిషన్లపై థర్డ్ పార్టీ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. సిబ్బంది ఆస్తులపై ఏసీబీ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అందరూ దోషులే అన్నట్టుగా సాగుతున్న ఈ మియాపూర్ సర్కిల్ సిండికేట్ను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ బద్దలు కొడతారా? లేక ఈ సమాంతర వ్యవస్థకు వంత పాడుతారా? అనేది కాలమే నిర్ణయించాలి.






