11 April, 2026 | 3:07 AM

ఇండోర్ స్టేడియం పనుల్లో వేగం పెంచాలి

11-04-2026 12:59 AM

పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కాటారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాటారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఇండోర్ స్టేడియం పనులు నత్త నడకన సాగడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటవెంటనే మంజూరు చేస్తామని తెలిపారు.

గుత్తేదారు పనులను వేగవంతం చేయకపోతే నోటీస్ ఇచ్చి అతనిని తప్పించి నూతన గుత్తే దారుకు పనులు అప్పగించాలని అధికారులకు సూచించారు. అనంతరం కాటారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ షెల్టర్ స్థలాన్ని పరిశీలించి తహసీల్దార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరగా ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా యువజన, క్రీడల అధికారి రఘు, తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.