calender_icon.png 12 February, 2026 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేమాతరం ఆలపించాకే జనగణమన

12-02-2026 01:51:26 AM

  1. తొలగించిన నాలుగు చరణాలతో సహా ఆరింటినీ పాడాల్సిందే
  2. పాఠశాలల్లో ప్రార్థన సమయానికే వందేమాతరం తప్పనిసరి 
  3. కేంద్ర హోం శాఖ కీలక ఉత్తర్వులు జారీ 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : జాతీయ గేయం వందేమాతరానికి కేంద్రం అగ్రతాంబూలం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని  పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలను జారీ చేసింది.‘వందేమాతరం’ పాడినప్పుడు అందరూ లేచి నిలబడాలని కొత్త నిబంధనలలో కోరింది.

పద్మ అవార్డుల వంటి పౌరపురస్కారాల ప్రదాన వేడుకలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని ఇతర కార్యక్రమాల్లో... వారి రాక, నిష్క్రమణ సమయంలో కూడా వందేమాతరం ప్లే చేయాలని తెలిపింది. సినిమా హాళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా వందేమాతరం ప్లే చేయాలని... అయితే ఈ సందర్భంలో లేచి నిలబడటం తప్పనిసరి కాదని పేర్కొంది. 1937లో కాంగ్రెస్ తొలగించిన నాలుగు చరణాలతో సహా మొత్తం ఆరు చరణాలు ఆలపించాలని తెలిపింది.

ఈ వ్యవధి 3 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. ఇక, వందేమాతరం అనేది ఒక గేయం మాత్రమే కాదు..  భారత స్వాతంత్య్ర పోరాటానికి ఆత్మగా నిలిచింది. ఈ పాట బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది భారతీయులను ఏకం చేసి.. దేశ స్వాతంత్య్ర పోరాట నినాదంగా మారింది.  ఈ గేయాన్ని 1875 సంవత్సరంలో బంకించంద్ర ఛటర్జీ రాశారు. దీనిలోని ప్రతి పదం దేశం పట్ల భక్తి, గౌరవం, గర్వ భావనతో నిండి ఉంటుంది.