కేంద్రమంత్రి పదవి మీ భిక్షే..
కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి పదవి.. బీజేపీలోనే సాధ్యం
రాష్ట్ర, కరీంనగర్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా
కార్యకర్తలకు కృతజ్ఞతలు.. మోదీ, అమిత్‌షాకు ధన్యవాదాలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్/జగిత్యాల/రాజన్న సిరిసిల్ల, జూన్ 19(విజయక్రాంతి): తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం కరీంగర్ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన భిక్షేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన బుధవా రం కరీంనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కరీంనగర్‌కు, తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగానంటే కేవలం బీజేపీ వల్లే సాధ్యమైందని చెప్పారు. తన ప్రతి పోరాటంలో అడుగులో అడుగు వేసిన కార్యకర్తలకు ఈ పదవిని అంకితమిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ, కరీంనగర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టంచేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత పూర్తిగా అభివృద్ధి కోసమే పనిచేస్తానని పునరుద్ఘాటించారు.
కరీంనగర్‌లో బండికి ఘన స్వాగతం
కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు వచ్చిన బండి సంజయ్‌కి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా శనిగరం వద్దకు రాగానే బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమా ర్ కర్ర సాము చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, ఆమె సోదరుడు రాణాప్రతాప్ ట్రాక్టర్లపై మోదీ, అమిత్‌షా, బండి కటౌట్లను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. అక్కడినుంచి వందలాది వాహనాలతో కరీంనగర్‌కు వచ్చిన బండికి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అపూర్వ స్వాగతం పలికారు.
ఓపెన్ టాప్ వాహనంలో నగర ప్రజలకు అభివాదం చేస్తూ కరీంనగర్ కమాన్ వద్దకు వచ్చారు. అక్కడ నేలపై ప్రణమిల్లారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు, గుర్తింపునిచ్చిన తెలంగాణకు సెల్యూట్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. తెలంగాణ చౌరస్తా వద్ద ముస్లిం నేత లు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద కరీంనగర్ కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు బండికి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అక్కడి నుంచి చైతన్యపురిలోని మహాశక్తి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తా
ఆలయాలు అభివృద్ధి చేయడంలో గత పాలకుల నిర్లక్ష్యం వహించారని, తాను చొరవ తీసుకుని కొండగట్టు ఆంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేంద్ర హోం సహాయశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కొండగట్టుకు చేరుకున్న బండికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన సాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ముందు కట్టిన ముడుపును విప్పి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీనరసింహ సామి ఆలయానికి చేరుకొని సామి వారికి ప్రత్యేక పూజలు నిరహించారు. ఆయన వెంట మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, నాయకులు శ్రావణ్, రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
రాజన్నకు కోడెమొక్కు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. గర్భాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించి సత్కరించారు. కేంద్ర మంత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.






