ఆటో రిక్షా డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
- లేకుంటే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది
- ఘనంగా తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా 4వ మహాసభలు ప్రారంభం
- ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు వీఎస్ బోస్
ముషీరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే బిఆర్‌ఎస్ కు పట్టినగతే కాంగ్రెస్ కు పడుతుందని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక ధోరణి వలన రవాణా రంగ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయం(సత్యనారాయణ రెడ్డి భవన్)లో తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ఎఐటియుసి) హైదరాబాద్ జిల్లా 4వ మహాసభలు యూనియన్ అధ్యక్షుడు ఎన్. అశోక్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా కార్యాలయం ముందు ఎఐటియుసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఐటియుసి సీనియర్ నాయకులు విఎస్.బోస్, తెలంగాణ రాష్ట్ర ఆటో, మోటార్ డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం, ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్బంగా విఎస్. బోస్ మాట్లాడుతూ ఎఐటియుసి ఆటో రిక్షా డ్రైవర్ల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు.
బి. వెంకటేశం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఆటో డ్రైవర్లు చేసిన పోరాటాలను గుర్తుచేశారు. రవాణారంగా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి అనేక ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికై ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాల ముట్టడి నిర్వహిస్తున్నామని, అలాగే ఆగస్టులో ప్రభుత్వం కళ్లు తెరిచేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లను సమైక్యం చేసి ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో కమతం యాదగిరి, యూనియన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. జంగయ్య, ఆఫీస్ బేరర్లు ఎండి. ఒమర్ ఖాన్, ఎ. బిక్షపతి యాదవ్, కొంరెల్లి బాబు, మున్నూరు కృష్ణ, ఎస్.కె. అతీఫ్ తిరుమలేష్ గౌడ్, ఎండి ఆరిఫ్, ఎండి సలీమ్, ఎండి జాకిర్, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






