రేవంత్ భూతం రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది

16-09-2026 | 04:05am

ప్రజలకు పట్టిన పీడ కాంగ్రెస్

అందుకే నీళ్లు, అభివృద్ధి విషయంలో వెనుకబాటు

కేఆర్‌ఎంబీకి ఉత్తరం రాసే సోయి ప్రభుత్వానికి లేదు

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రేవంత్ భూతం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తూ నాశనం చేస్తున్నదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి(Former Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు పట్టిన పీడ కాంగ్రెస్ దెయ్యమన్నారు.

అందుకే తెలంగాణలో నీళ్లు, అభివృద్ధి కుంటుబడ్డాయని ఆరోపించారు. ప్రజలు ఏమడిగినా ఎల్ నినో సాకుతో కాంగ్రెస్ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ ఇవాళ ప్రారంభిస్తే నీళ్లు సిద్ధంగా ఉన్నాయని, సాగర్ ఎడమ కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నా కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు పంటలు వేసుకోవాలా వద్దా అని స్పష్టంగా చెప్పమంటే సమాధానమే లేదన్నారు. మన నీళ్లను దోచుకుపోతుంటే కేఆర్‌ఎంబీకి ఉత్తరం రాయాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. ఇంతకన్నా తక్కువ నీళ్లున్న సమయంలోనే పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నామని, ఆనాడే వాళ్ల బాస్ అయిన చంద్రబాబు మెడలు వంచి తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా వచ్చినా పంటలు ఎండబెడుతున్నారని విమర్శించారు.

కండ్ల ముందే ఆంధ్రకు నీళ్లు దోచుకుపోతుంటే ఇక్కడి సీఎం, మంత్రులు కండ్లు మూసుకుపోయినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంటలు పండనీయొద్దనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టిందని, పంటలు పండితే నీళ్లు, కరెంటు, బోనస్ లు ఇవ్వాల్సి వస్తుందనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆనాడే పాదయాత్ర చేసి పంటలు కాపాడారని, ఇవాళ రైతుల తరపున ఎటువంటి పోరాటానికైనా కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఒక్క ఎకరం కూడా ఎండనీయొద్దని మిర్యాలగూడ రైతు ధర్నాలో కేటీఆర్ స్పష్టంగా చెప్పారని, మరోమారు పాదయాత్రలు చేసైనా సరే రైతుల పంటలు ఎండకుండా పోరాడుతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న అన్ని తండాల్లో గిరిజన సంబరాలను ఘనంగా జరుపుకోవాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలోనే తండాలు గ్రామపంచాయతీలు అయ్యాయని, రిజర్వేషన్లు 10 శాతానికి పెరిగి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలకు ఇచ్చిన మోసపూరిత హామీలను విస్మరించిందని, మోసాలను ఎండగట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు