30 March, 2026 | 11:55 AM

తెలంగాణకు రెవెన్యూశాఖ గుండెకాయ

17-02-2025 01:13 AM

* ధరణితో ప్రజలు నానావస్థలు పడ్డారు.. నేనూ బాధితుడినే

* ఏడాది పాలనలో 56 వేల ఉద్యోగాలిచ్చాం

* పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంలో తగ్గేదిలేదని.. ప్రజల సహకారంతో సువర్ణ తెలంగాణ కోసం ముందుకెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్‌గౌడ్ చెప్పారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు డా. కొనగాల మహేశ్ తదితరులతో కలిసి ఆ సంఘం  2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణకు రెవెన్యూ శాఖ గుండెకాయలాంటిదని, ఆ శాఖ ఉద్యోగులు భూసమస్యలపై ఓపిక, సహనంతో ప్రజల కోసం పని చేయాలన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో ప్రజలు నానావస్థ లు పడ్డారని.. అందులో తానూ బాధితుడినేనని ఆవేదన వ్యక్తం చేశారు. 

పనికిరాని ‘కాళేశ్వరం’..

కేసీఆర్ పదేండ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధేమీ లేదని, పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కరెంట్ బిల్లులకే ఎక్కువ ఖర్చవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామన్నారు.

ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖాళీలను గుర్తించి మరిన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు. టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాలరాంరెడ్డి, తహసీల్దార్ల  అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాక రమేశ్, మహిళా అధ్యక్షురాలు రాధ, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్రె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.