1 March, 2026 | 9:12 AM

నాసిరకం మందులపై చర్యలేవి?

01-03-2026 12:00 AM

నకిలీ మందుల సమస్య భారతదేశంలో కేవలం ఆరోగ్య సమస్య కాదు, అది ఒక సామాజిక, ఆర్థిక నేరం. వివిధ అధ్యయనాలు దేశీయ మార్కెట్లో అ మ్ముడయ్యే మందుల్లో గణనీయమైన శాతం నాసిరకం లేదా నకిలీ అని చెబుతున్నాయి. ఫలితంగా రోగం తగ్గకపోగా మరింత తీవ్రమవుతున్నది. యాంటీబయాటిక్స్ విషయంలో ఇది ప్రాణాంతకంగా మారిపోయింది. దీంతో భవిష్యత్తులో ప్రజారోగ్యం సంక్షోభంగా మారే ప్రమాదముంది.

ఔషధ నియం త్రణ అధికారులు ప్రజారోగ్యానికి కాపలాదారులుగా ఉండాలి. కానీ వాస్తవం లో వారు ఎంతవరకు ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. తనిఖీలు తూతూమంత్రంగా మారి కొన్ని ప్రాంతాలకే మాత్రమే పరిమితమయ్యాయి. పెద్ద నగరాల్లో కొద్ది దుకాణాలను తనిఖీ చేసి, నివేదికల్లో సంఖ్యలు చూపించి, మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలను చూసీ చూడనట్టు వ్యవహరించడం అలవాటుగా మారిపోయింది. కఠినమైన చట్టాలు పుస్తకాల్లోనే ఉంటే సరిపోదు. అమలైనప్పుడే ఫలితం ఉంటుంది.

ఔషధ నియంత్రణ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దాలి. నాసిరకం మందు లు తయారు చేసే వారిపై, అనుమతులు ఇచ్చే అధికారులపై, అలాగే నకిలీ మందులు అమ్ముతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.  శిక్షలు కేవ లం జరిమానాలకే పరిమితం కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారికి జీవితకాల జైలు శిక్షలు విధించినప్పుడే మార్పు సాధ్యమవుతుందని గ్రహించాలి.

 నాగరాజు, కరీంనగర్