ఆరోగ్య తెలంగాణలో అంగన్వాడీల పాత్ర కీలకం
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, ఏప్రిల్ 13(విజయక్రాంతి): ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అంగన్వాడీ కేంద్రాలు అత్యంత కీలకమైనవని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లకు ఆయన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లలోని ’పోషణ్ ట్రాకర్’ యాప్ ద్వారా పిల్లల ఆరోగ్య వివరాలు, పోషకాహార కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.
చిన్నారులను సొంత బిడ్డల్లా భావించి వారికి పౌష్టికాహారం అందించాలని, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతకుముందు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మంది దివ్యాంగులకు త్రిచక్ర స్కూటీలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, వారి అభ్యున్నతే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వెల్లడించారు.కార్యక్రమాల్లో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, సీడీపీఓ శాంతి రేఖ, టీపీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, ఎంపీడీఓ కుసుమ మాధురి, మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్,మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






