సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం తీసుకుంటే తాము జీవనోపాధి కోల్పోతాం
ఆర్టీవో ముందు రైతులు ఆవేదన
కందుకూరు,ఏప్రిల్ 13 ( విజయ క్రాంతి ): టీజీఐఐసికి భూములు ఇచ్చేందుకు రైతులు సహకరించాలని కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి కోరారు.సోమవారం మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూ బేగరీ కంచ గ్రామపంచాయతీలో సర్వే నెంబరు 221 నుంచి 248 సర్వేనెంబర్ వరకు మొత్తం 233 ఎకరాల భూమిని టీజీఐఐసి కోసం సేకరించడం కోసం బేగరీకంచ గ్రామంలో కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సర్వే నంబర్లలో మొత్తం 273 ఎకరాల భూమి దేవల్ శివాజీ పురాణాపూల్ కు సంబంధించిన దేవాలయానికి చెందిన భూమి.
దీనిపై ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉన్న రైతులు సాగు చేసుకుంటు జీవనం కొనసాగిస్తున్నారని ఆభూమిని ఇప్పుడు టీజీఐఐసీ కొరకు సేకరించడం కోసం గ్రామ సభ నిర్వహించారు.ఈ గ్రామ సభలో గ్రామస్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నా మాభూమిని తీసుకుంటే తాము జీవనోపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే హెచ్‌ఎండిఏ రోడ్ కు ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని రైతులు తెలిపారు.నష్టపరిహారం కూడా ఎక్కువగా ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మరియు టీజీఏసి డిజెడ్‌ఎం, గ్రామ సర్పంచ్,తహాశీల్దారు గోపాల్,ఆయా గ్రామ పెద్దలు ఆర్డిఓ ఆఫీస్ డిటి రాజు తదితరులు పాల్గొన్నారు.






