10-11-2025 12:00:00 AM
గోండి భాష రచయిత తొడసం కైలాస్
ఆదిలాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : రోజురోజుకు అంతరించిపోతున్న గోండి భాషను బ్రతికించడంలో గోండి భాష, సంస్కృతినీ కాపాడటంలో కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమని గోండి భాష రచయిత తొడసం కైలాస్ అన్నారు. ఆదివారం రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామానికి చెందిన ఖీక్రీ కళాకారుడు కుమ్ర శంభు, వారి సతీమణి కుమ్ర లక్ష్మి ని, డహ్కి కళాకారుడు కుమ్ర రాము ని, డోల్కి కళాకారుడు కుమ్ర విఠల్ ని, పాట కు కోరస్ ఇచ్చే కుమ్ర సుశీలని, గేడం సూర్యభాన్ ను కైలాస్ దంపతులు శాలువాతో సన్మానించి, ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా తొడసం కైలాస్ మాట్లాడుతూ... తమ పూర్వీకుల నుండి తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ఖీక్రీ కళను బతికిస్తూ ముందుతరాల వారికి ఖీక్రి కళ శిక్షణ అందజేస్తున్న కుమ్ర శంభు కి ధన్యవాదాలు తెలిపారు. భాష బతికి ఉండడంలో కథలు పాటలు ఎంతో ముఖ్యమని తెలిపారు. అలాగే చించుఘాట్ గ్రామస్తులు అందరూ కలిసి తొడసం కైలాస్ దంపతులకు చీరే సారేతో సత్కరించారు. అనంతరం తొడసం కైలాస్ తాను గోండి భాషలోకి అనువదించిన సోభత ఖడి పుస్తకాన్ని గ్రామస్తులందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో చించుఘాట్ గ్రా మ పెద్దలు కుమ్ర మాహ్దు, గెడం మాన్కు, కుమ్ర శశిరేఖ, తదితరులు పాల్గొన్నారు.