గ్రామ సమగ్రాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, మార్చి 4 (విజయక్రాంతి) : గ్రామాల సమగ్రాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలోనీ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరై మాట్లాడారు. సర్పంచులకు ఈనెల 2 నుండి 7వ తేదీ వరకు 3వ విడతగా సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్), మునగాల, చివ్వెంల, పెన్పహాడ్ మండలాల సర్పంచులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
సర్పంచులు పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామపంచాయతీ పనుల నిర్వహణ, గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ శిక్షణలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్క సర్పంచ్ ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తద్వారా తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలని, సాంకేతిక అంశాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, సర్పంచులు పాల్గొన్నారు.




