5 March, 2026 | 3:21 AM

500కు లీటర్ పెట్రోల్.. వదంతులు

05-03-2026 12:18 AM
  1. సోషల్ మీడియాలో వైరల్ అయిన వదంతులు  

పెట్రోల్ బంకుల వద్ద పోటెత్తిన జనం

కృత్రిమ కొరత సృష్టించొద్దన్న అధికారులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి):రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు మూతపడతాయని, లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.500 కి చేరుకుంటుందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్లు హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపాయి.ఈ వదంతులను నమ్మిన వాహనదారులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరారు.ఒక్కసారిగా జనం పోటెత్తడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో,ప్రధానంగా పాతబస్తీలో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి.

ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల కారణంగా అరబ్ దేశాల నుంచి భారత్‌కు రావాల్సిన క్రూడ్ ఆయిల్ ముడి చమురు షిప్‌లు ఆగిపోయాయంటూ కొందరు తప్పుడు ప్రచారానికి తెరలేపారు.చమురు సరఫరా నిలిచిపోవడంతో కొద్ది రోజుల్లోనే పెట్రోల్ బంకులు మూతపడతాయని, ఉన్న పెట్రోల్ ధర లీటరు రూ.500 దాటుతుందంటూ వాట్సా ప్, తదితర సామాజిక మాధ్యమాల్లో వార్త లు సృష్టించారు.

ఈ వార్తలను నిజమని నమ్మిన పలువురు వాహనదారులు, యువకులు బైకులు, కార్లలో పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు.వాహనాల ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో పాటు.. ప్లాస్టిక్ బాటిళ్లలోనూ పెట్రోల్ పట్టుకెళ్లేందుకు క్యూ కట్టారు.దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వదంతులను నమ్మి ఒక్కసారిగా జనం రావడంతో బంకుల వద్ద అనవసరమైన రద్దీ ఏర్పడి సామాన్య వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

అదంతా ఫేక్.. నమ్మొద్దు.. అధికారులు..

ఈ పుకార్లపై ప్రభుత్వ వర్గాలు, అధికారిక చమురు సంస్థలు వెంటనే స్పందించాయి.పెట్రోల్ బంకులు మూతపడతాయన్నది కేవలం పుకారు మాత్రమేనని, చమురు ధరలు రూ.500 కు చేరుకుంటాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశాయి.

అనవసరంగా భయాందోళనలకు గురై ప్రజలు పెట్రోల్ కోసం ఎగబడితే మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని.. ఎవరూ ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని అధికారులు కోరారు.ఎలాంటి అధికారిక సమాచారం ఉన్నా ప్రభుత్వ వార్తా సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు.