calender_icon.png 19 January, 2026 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గులాబీ గురి

19-01-2026 02:05:43 AM

  1. పురపోరుకు బీఆర్‌ఎస్ సిద్ధం
  2. పట్టణ రాజకీయాల్లో ఆధిపత్యమే లక్ష్యం
  3. మెజారిటీ స్థానాల్లో గెలిచేందుకు సమగ్ర వ్యూహాలు
  4. డివిజన్ల వారీగా ఇన్‌చార్జ్జుల నియామకం
  5. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
  6. పరిగణనలోకి డివిజన్‌కు 2 లేదా 3 పేర్లు
  7. కార్పొరేషన్లకు ఇన్‌చార్జులుగా కీలక నేతలు
  8. కరీంనగర్‌కు హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
  9. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ జిల్లాల పర్యటన
  10. ఇప్పటికే ముగిసిన ఉమ్మడి జిల్లాల నేతలతో సన్నాహక సమావేశాలు

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ పార్టీ అగ్రనేతలు వ్యూహ రచనను వేగవంతం చేశారు. కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఇప్ప టికే అన్ని ఉమ్మడి జిల్లాల నాయకులతో సమావేశాలు ముగిశాయి.

పట్టణ తెలంగాణలో పట్టు బిగించడంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిపత్యం కనబర్చేలా పనిచేయాలని నేతల కు దిశానిర్దేశం కూడా చేశారు. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యం దిశగా వ్యూహా లు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం డివిజన్ల వారీగా ఇన్‌చార్జుల నియామకం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ను పార్టీ వేగవంతం చేసింది. పార్టీ అంతర్గతంగా జరిపిన సర్వేలు, గత ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ సమీకరణలను ఆధారంగా చేసుకుని అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్ విస్తృతంగా కసరత్తు చేస్తోంది.

గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలనే స్పష్టమైన సంకేతాన్ని పార్టీ అధిష్ఠానం ఇచ్చింది. మొత్తంగా, మున్సిపల్ ఎన్నికలను బీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి పట్టణ ప్రాంతాల్లో పార్టీ పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

ప్రతి డివిజన్‌కూ ఇన్‌చార్జులు

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రతి డివిజన్‌కు ప్రత్యేకంగా పార్టీ ఇన్‌చార్జులను నియమిస్తూ బీఆర్‌ఎస్ కీలక నిర్ణ యం తీసుకుంది. స్థానిక పరిస్థితులు, ఓటరు సమీకరణ, ప్రతిపక్ష వ్యూహాలను అధ్యయనం చేసి పార్టీ బలాన్ని పెంచేలా వీరు పనిచేయనున్నారు. ప్రతి డివిజన్‌కు కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు పేర్లను అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకుని తుది ఎంపిక చేయనున్నారు.

చివరి నిమిషంలో గెలుపు అవకాశాలున్న వ్యక్తినే ఫైనల్ అభ్యర్థిగా ప్రకటించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విధానం ద్వారా పార్టీ అభ్యర్థి గెలవాలి, వ్యక్తి కాదు అన్న ధోరణితో బీఆర్‌ఎస్ ముందుకెళ్తోంది. కేవలం మున్సిపాలిటీలే కాదు, ప్రధాన కార్పొరేషన్లపై కూడా బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మున్సిపాలిటీలతో పాటు ప్రధాన కార్పొరేషన్లకు కూడా ప్రత్యేక ఇన్‌ఛార్జీలను నియమించనున్నారు.

ఈ క్రమంలో కరీంనగర్ కార్పొరేషన్‌కు హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఇన్‌ఛార్జులుగా నియమించడం వెనుక స్పష్టమైన రాజకీయ లెక్కలు ఉన్నాయి. హరీశ్‌రావుకు ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రజాద రణ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పరిపాలన అనుభవం, దళిత సామాజిక వర్గాల్లో ప్రభావాన్ని వినియోగించుకుని కరీంనగర్‌ను రాజకీయంగా ప్రతిష్టాత్మక కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఇద్దరు నేతలు అక్కడ పార్టీని బలోపేతం చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను పర్యవేక్షించనున్నారు. ఇదే తరహాలో వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి కార్పొరేషన్లకు కూడా కీలక నేతలను బాధ్యులుగా నియమించే అవకాశం ఉంది. 

కీలకంగా మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో పట్టణ ప్రాంతాలు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అత్యంత ప్రభావశీ లమైనవి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల వంటి కేంద్రాలు రాజకీయ వాతావరణాన్ని నిర్దేశిస్తాయి. పట్టణ పాలనలో ఆధిపత్యం కొనసాగించడం, అధికార పార్టీపై ప్రతిపక్షంగా రాజకీయ ఒత్తిడి పెంచడం, అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ టెస్ట్ వంటి అంశాలపై బీఆర్‌ఎస్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నది. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో పట్ట ణ అభివృద్ధి, మౌలిక వసతులు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు బలంగా అమలయ్యాయని పార్టీ చెబుతోంది.

దీన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధా న అస్త్రంగా మలచుకోవాలని యోచిస్తున్నది. మున్సిపల్ ఫలితాల్లో బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధిస్తే, రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయంగా పైచేయి సాధించినట్లుగా భావించనున్నారు. దీంతోపాటు 2028 అసెంబ్లీకి ముందు ఓటర్ల అభిప్రాయాన్ని అంచనా వేసేందుకు ఇది ఒక అవకాశంగా మారనుంది. ఇందులో భాగంగా డివిజన్ల వారీ వ్యూహం, మైక్రో మేనేజ్మెంట్ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నది. సంప్రదాయ ప్రచార పద్ధతులను పక్కనబెట్టి, అత్యంత సూక్ష్మస్థాయి వ్యూహాన్ని అమలు చేస్తోంది. తద్వారా పట్టణ తెలంగాణపై మళ్లీబీఆర్‌ఎస్ ముద్ర వేయాలని చూస్తుంది. 

‘మున్సిపల్’పై ‘పంచాయతీ ఫార్ములా’

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూపిన రాజకీయ పట్టు, క్షేత్రస్థాయి బలాన్ని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని బీఆర్‌ఎస్ గట్టిగా ప్రయత్నిస్తున్నది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ పోరులోనూ సత్తా చాటాలనే స్పష్టమైన లక్ష్యంతో పార్టీసమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇది కేవలం స్థానిక సంస్థల పోరుగా కాకుండా పట్టణ తెలంగాణ రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశించే పరీక్షగా బీఆర్‌ఎస్ చూస్తోంది.

గత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనుసరించిన క్యాడర్ ఆధారిత ప్రచారం, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం, వ్యూహాత్మక అభ్యర్థుల ఎంపిక వ్యూహాన్ని అమలు చేసింది. ఇదే నమూనాను మున్సిపల్ ఎన్నికలకు అన్వయిస్తోంది. గ్రామాల్లో పనిచేసిన ‘డోర్ టు డోర్’ మోడల్‌ను పట్టణ డివిజన్లలో అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి వీధి, కాలనీ, అపార్ట్‌మెంట్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయపరిచే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. 

కేటీఆర్ జిల్లాల పర్యటన

పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపినట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపాలని బీఆర్‌ఎస్ యోచిస్తున్నది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుని బీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉందని స్పష్టంగా పంపిస్తున్న సంకేతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు.

ఆయన స్థానిక నాయకులతో సమీక్షలు నిర్వహించి, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని, అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయనున్నారు. పర్యటనలో భాగంగా స్థానిక నాయకత్వంలో విభేదాలను పరిష్కరించడం, అసంతృప్త నేతలను బుజ్జగిం చడం, బలమైన అభ్యర్థులను గుర్తించడం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పట్టణ ప్రజలకు వివరించడంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే రాజకీయ వ్యూహమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.