19-01-2026 02:10:57 AM
ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గ తీర్మానం
మేడారం, జనవరి 18 (విజయక్రాంతి): వీలైనంత త్వరగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఎన్నికల తంతు పూర్తి చేయాలని నిశ్చయించింది. దీంతో పదవీ కాలం ముగిసిన రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సుగమమైంది. అలాగే ఏడు కార్పొరేషన్లలో 2,996 వార్డులు, డివిజన్లలోనూ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లయింది.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ సైతం పూర్తయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలు ఉన్నందున, అంతకుముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రివర్గం యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం సుమా రు 2 గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది.
సమావేశంలో మంత్రివర్గం అనేక కీలక అంశాలను చర్చించి, కొన్నింటిపై తీర్మానాలు చేసింది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మీడియా సమా వేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
వచ్చే జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధా న ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధికి సబ్ కమి టీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీటిపై దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురవాస్తు శాఖలు సంయుక్తంగా నివేదికలు రూపొందిస్తాయని స్పష్టం చేశారు. మార్చి 31 నాటికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తామని వెల్లడించారు.
మెట్రో ఫేజ్ భూసేకరణ..
మంత్రివర్గం హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్‌త ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీన చేసుకునే ప్రక్రియపైనా చర్చించిందని వివరించారు. మెట్రో ఫేజ్ 2ఏ పరిధిలోని నాలుగు కారిడార్లు, ఫేజ్ బీ పరిధిలోని మూడు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి వెళ్లాయని గుర్తుచేశారు. ఈలోపు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామని ప్రకటించారు.
అందుకు రూ.2,787 కోట్ల అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ లో రిజిస్ట్రార్ పోస్టు భర్తీకి ఆమోదం తెలిపిందని తెలిపారు.
అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్ మెంట్‌కు టీజీఐఐసీకి 494 ఎకరాల భూమి కేటాయింపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ నుంచి శిల్పా లేథూ అవుట్ రోడ్డు వరకు కొత్తగా తొమ్మిది కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపిందని వివరించారు.
ములుగు జిల్లాలో ఎత్తిపోతల పనులకూ..
మంత్రి సీతక్క మాట్లాడుతూ .. ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. ప్రాజెక్ట్ పూర్తయితే రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపవచ్చని తెలిపారు. 7500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.143 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతుందని తెలిపారు.