calender_icon.png 19 January, 2026 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగడుగునా వెన్ను పోట్లు.. అబద్ధాలే!

19-01-2026 01:57:39 AM

రేవంత్‌రెడ్డిది ద్రోహ చరిత్ర

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): అడుగడుగునా వెన్నుపోట్లు.. అనుక్షణం అబద్ధాలు.. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట.. రేవంత్‌రెడ్డిది ద్రోహ చరిత్ర అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ హరీశ్‌రావు ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ద్రోహ బుద్ధి అనేది రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏలోనే ఉన్నదని మండిపడ్డారు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్‌లో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అని మండిపడ్డారు.

సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ అన్నారు. సీఎం అయి వుండీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తున్నారని విమర్శించారు. అవినీతి దాహం, ప్రజా ద్రోహం.. వెరసి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. రేవంత్ బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏమిటి అని ప్రశ్నించారు. పగలు రాహుల్ గాంధీ జపం.. రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ అని ఆరోపించారు. రేవంత్  రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నలలోనే సాగుతున్నదని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని, ఒక సీఎం బహిరంగంగా పిలుపునివ్వడం రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమేనని అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు బాధ్యత ఎటు పోయిందని ప్రశ్నించారు. డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇలాంటి చర్యలతో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగేలా బదులిస్తామని, ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం నేర్పుతామని స్పష్టం చేశారు.