తెరచాపకు ప్రేక్షకాదరణ కావాలి
అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీశ్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేశ్ భూపతి, నాగవంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నవీన్‌రాజ్ మాట్లాడుతూ.. “మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి ఈ సినిమానున చిత్రీకరించాం. ప్రేక్షకులు ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నా” అన్నారు.
‘ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంద’ని నటి శ్రీలు తెలిపారు. ‘అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాన’ని నటి పూజా సుహాసిని చెప్పారు. దర్శకుడు జార్జ్ మాట్లాడుతూ.. ‘సినిమాకు మంచి ప్రేక్షకుల ఆదరణ కలగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత కైలాష్ దుర్గం మాట్లాడుతూ.. “ఒక సినిమా చేయాలి అంటే నిర్మాతకు చాలా బలమైన సంకల్పంతోపాటు కుటుంబ బలం కూడా ఉండాలి. నాకు అలా బలంగా నిలబడిన నా కుటుంబానికి ధన్యవాదాలు. మా సినిమాను ప్రేక్షకులంతా ఆదరించి, ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ దర్శకుడు సముద్రతోపాటు చిత్రబృందం కూడా మాట్లాడారు.






