11 June, 2026 | 12:16 PM

ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం: కవిత

11-06-2026 11:46 AM
  1. తెలంగాణవాదంపై దాడి చేయాలనే కుట్రలు
  2. ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ ఆవిష్కరించిన కవిత

హైదరాబాద్: ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ను తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గురువారం ఆవిష్కరించారు. జులై 2న భూ పోరాటం చేసి ఉప్పల్ భగాయత్ భూములు(Uppal Bhagayath lands) స్వాధీనం చేసుకుంటామని కవిత స్పష్టం చేశారు. ఉద్యమకారుల భూ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యమ కారులకు 250 గజాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందేనని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

మరో మారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణవాదంపై దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మన అందరి చారిత్రక కర్తవ్యమని సూచించారు. ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్లంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కవిత విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మీ భవిష్యత్ కోసం ఉద్యమకారులు వాళ్ల జీవితాలనే త్యాగం చేశారని వివరించారు. మంచి చేసే కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలని కవిత పేర్కొన్నారు.