13 April, 2026 | 2:27 AM

నావ మునక

13-04-2026 12:51 AM

అటుగా పక్షులున్నాయి

హద్దుల్లేని ఆకాశాలను ఈదుతున్నాయి

అంతటా చెట్లున్నాయి

రంగు రంగుల కలల్ని పూయిస్తున్నాయి 

ఇటుగా మట్టిగెడ్డలున్నాయి

పచ్చని ఊహలకు ఊపిరిస్తున్నాయి

అటు నల్లని మబ్బులున్నాయి

చినుకులై దుంకి చిగుర్లేస్తున్నాయి 

ఇటు చల్లని పిల్ల గాలులున్నాయి

గాలిలో దీపాలకు గాసమిస్తున్నాయి 

ఇంకెన్నో జీవరాశులున్నాయి 

అవని శోభకు మురిసి 

మసలుతున్నాయి

ఇంకా సజల రాశులై  

సముద్రాలున్నాయి

నేలను నావచేసి నడిపిస్తున్నాయి 

నావలో ఎవరెవరున్నారూ?

వీటన్నింటికీ తోడు మనిషి కూడా!

నావను ఎవరు నడిపిస్తున్నారూ ?

నరుడి జిజ్ఞాస!

నావికుని చేతిలో ఆ చక్రం ఏమిటో ?

జిజ్ఞాసను అత్యాశను సముతులపరిచి

నావను ముందుకు 

నడిపే మంత్రదండం

అయ్యో, మరి నావ ఎందుకు

మునిగిపోతోందీ ?

 - కంచరాన భుజంగరావు