దక్షిణాదిపై ఢిల్లీ దండయాత్ర
భారత్ వివిధ భాషలు, సంస్కృతులు గల రాష్ట్రాల సమాహారం. ఇక్కడ ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే దేశ సమగ్రతకే ప్రమాదం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హెచ్చరించినట్లుగా, ఈ పునర్విభజన సమాఖ్య స్ఫూర్తిని సమాధి చేసేలా ఉంది.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సమాఖ్య వ్యవస్థపై గొడ్డలిపెట్టు వంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దేశ భవిష్యత్తును వెలిగించడానికో లేక దక్షిణాది రాష్ట్రాల గొంతు నులమడానికో అన్నట్టుగా మారిపోయాయి. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను అమాంతం పెంచే నెపంతో, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టేం దుకు ఢిల్లీ పీఠం సిద్ధమైంది.
అయితే, పాతబడిపోయిన 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ నియోజకవర్గాల పునర్విభజన, సరిహద్దుల మార్పులు చేపట్టాలని చూడ టం కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్ర మే కాదు; ఇది దక్షిణాది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, రాజకీయంగా వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చే కుట్రగా కనిపిస్తోం ది. హడావుడిగా నియోజకవర్గాలను విస్తరించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ప్రజా స్వామ్య వికాసం కంటే రాజకీయ ఆధిపత్యమేనని స్పష్టమవుతోంది.
రాజ్యాంగపరమైన చిక్కులు
నియోజకవర్గాల పెంపును గతంలో చాలా ఏళ్లపాటు స్తంభింపజేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. 1971 జనాభా లెక్కల తర్వాత, జనాభా నియంత్రణ పాటిం చే రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో 1976లో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సీట్ల సంఖ్యను 2001 వరకు పెం చడానికి వీలు లేకుండా రాజ్యాంగ సవరణ చేశారు. ఆ తర్వాత 2001లో నాటి వాజపే యి ప్రభుత్వం దీన్ని 2026 వరకు పొడిగించింది.
కానీ, ఇప్పుడు ఆ గడువు ముగుస్తున్న తరుణంలో, కేంద్రం శాస్త్రీయత లేని పద్ధతు ల్లో ముందుకువెళ్లాలని చూడటం ఆందోళనకరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకా రం ప్రతి జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కానీ, అది ఒక ప్రాం తానికి లబ్ధి చేకూర్చి, మరో ప్రాంతాన్ని శిక్షించేలా ఉండకూడదు. 2027లో కొత్త జనాభా లెక్కలు రానున్న తరుణంలో, 15 ఏళ్ల క్రితం నాటి పాత గణాంకాలతో ఈ పందెం ఆడాల్సిన అవసరం ఏముంది?
దక్షిణాదికి రాజకీయ ఉరిశిక్ష
దక్షిణాది రాష్ట్రాలు గత ఐదు దశాబ్దాలు గా జాతీయ క్రమశిక్షణను తూ.చ తప్పకుండా పాటిస్తూ, జనాభా నియంత్రణలో ఆదర్శవంతమైన ఫలితాలను సాధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు తమ వనరులను విద్య, వైద్యంపై వెచ్చించి జనాభా పెరుగుదలను అదుపులోకి తెచ్చాయి. కానీ, ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న పునర్విభజన సూత్రం ఈ రాష్ట్రాల పాలిట శాపంగా మారుతోంది.
జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు ఈ రాష్ట్రాలకు గౌరవం దక్కాల్సిందిపోయి, రాజకీయ లబ్ధి జరగాల్సిందిపోయి వారి రాజకీ య ప్రాతినిధ్యాన్ని తగ్గించి ‘ఉరిశిక్ష’ వేయాలని చూడటం అత్యంత శోచనీయం. మరో వైపు, జనాభా విస్ఫోటనం చెందిన ఉత్తరాది రాష్ట్రాలకు కేవలం జనాభా ప్రాతిపదికన అత్యధిక సీట్లు కట్టబెట్టడమంటే, అక్రమంగా రాజకీయ అధికారాన్ని ఒకే ప్రాంతం వైపు దారిమళ్లించడమే. ఇది అభివృద్ధిని కాంక్షించే రాష్ట్రాలను శిక్షించి, వెనుకబడిన లేదా క్రమశిక్షణ లేని ప్రాంతాలకు పట్టం కట్టడం వంటి దని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
గణాంకాల రూపంలో అన్యాయం
ప్రస్తుత అంచనాల ప్రకారం పునర్విభజ న జరిగితే, లోక్‌సభలో ఉత్తరప్రదేశ్ స్థానా లు 80 నుంచి దాదాపు 140కి పైగా పెరిగే అవకాశం ఉంది. అలాగే బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుంది. దీనికి భిన్నంగా, దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో సీట్ల పెంపుదల చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా, పార్లమెంట్‌లో దక్షిణాది ఎంపీల గొంతుక కేవలం నామమాత్రంగా మారిపోతుంది. దేశానికి అవసరమైన మెజారిటీ కేవలం నాలుగైదు ఉత్తరాది రాష్ట్రాల నుంచే లభించే పరిస్థితి వస్తే, అప్పుడు దేశ ప్రధానిని లేదా కేంద్ర విధానాలను నిర్ణయించడంలో దక్షిణాది పాత్ర శూన్యమవుతుంది. ఇది సమా ఖ్య స్ఫూర్తికే విరుద్ధమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆర్థిక భాగస్వామ్య నమూనా
కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న ఈ అన్యాయమైన ప్రక్రియను అడ్డుకునేందుకు తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక శక్తివంతమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డీలిమిటేషన్ కోసం కేవలం మనుషుల తల ల గణన (జనాభా) మాత్రమే కొలమానం కాదని, దేశ నిర్మాణంలో ఏ రాష్ట్రం ఎంత ఆర్థిక సహకారం అందిస్తోందనే అంశాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని ఆయన గర్జించారు. దేశానికి అత్యధిక పన్నుల ఆదాయాన్ని సమకూరుస్తూ, జాతీయ స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
అదనంగా పెంచే సీట్లలో సగం మాత్రమే జనాభా ప్రాతిపదికన కేటాయించి, మిగిలిన సగం ఆయా రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి, ప్రగతి పరుగులు, ఆయా రాష్ట్రాల పనితీరు ఆధారంగా కేటాయించే ‘హైబ్రీడ్ నమూనా’ను ఆయన ప్రతిపాదించారు. ఈ డిమాండ్ ఇప్పుడు ఢిల్లీ పీఠం పునాదులను కదిలిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించే రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడటం ప్రజాస్వామ్య ధర్మమని ఆయన చాటిచెప్పారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధిని యం’ బిల్లును పునర్విభజనతో ముడిపెట్ట డం కేంద్రం చేసిన ఒక వ్యూహాత్మక కుతంత్రమని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. మహిళా సాధికారతపై కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ఇప్పుడే రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. కానీ, మహిళా రిజర్వేషన్లు కావాలంటే పునర్విభజన జరగాల్సిందేనని షరతు పెట్టడం వెనుక ఉన్న అస లు కారణం దక్షిణాది గొంతు కోయడమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ చేపడుతున్న విధానంపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. సోని యాగాంధీ వంటి సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నట్లుగా, పునర్విభజన ప్రక్రియ ముగిసే వరకు మహిళా రిజర్వేషన్లను ఆపడమంటే కాలయాపన చేయడమే.
సమాఖ్య వ్యవస్థకు సవాలు
భారతదేశం వివిధ భాషలు, సంస్కృతులు గల రాష్ట్రాల సమాహారం. ఇక్కడ ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే దేశ సమగ్రతకే ప్రమాదం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామ య్య హెచ్చరించినట్లుగా, ఈ పునర్విభజన సమాఖ్య స్ఫూర్తిని సమాధి చేసేలా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘ఇది తమిళనాడుకు చివరి హెచ్చరిక’ అని పేర్కొంటూ, తమ రాష్ట్ర హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని గర్జించా రు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం తనకున్న మెజారిటీ బలంతో దక్షిణాది ఆత్మగౌరవాన్ని తొక్కివేయాలని చూస్తే, అది దేశంలో మరో ప్రజా ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంది. అభివృద్ధిని, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే, చరిత్ర క్షమించదని పాలకులు గుర్తించాలి. కేవలం జనాభాను కాకుండా, ఆర్థిక తోడ్పాటు, అక్షరాస్యత, తలసరి ఆదాయం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నప్పుడే అందరికీ నిజమైన న్యాయం జరుగుతుంది. లేనిపక్షంలో ఢిల్లీ పీఠంపై ఉత్తరాది గుత్తాధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాలు కేవలం ‘ట్యాక్స్ పేయర్స్’గా మిగిలిపోతాయే తప్ప ‘నిర్ణేతలు’గా మారలేవు. ఇప్పటికైనా ఢిల్లీ గద్దెపై ఉన్న బీజేపీ సర్కార్ తన మొండి వైఖరిని వీడి, దక్షిణాది ఆవేదనను ఆలకించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు తప్పవు.
వ్యాసకర్త: 9848559863
వెంకగారి భూమయ్య






