18 April, 2026 | 2:19 AM

భారత్ ఆర్థిక పతనం!

18-04-2026 12:00 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో భారతదేశం ర్యాంకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. మొన్నటివరకు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ ఆరో స్థానానికి పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం భారత జీడీపీ 3.92 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్టు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వెల్లడించడం గమనార్హం.

జపాన్ (4.44 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్‌లు (4 ట్రిలియన్ డాల ర్లు) భారత్‌ను అధిగమించడాన్ని మనం చూస్తున్నాం. అయితే, ఈ ర్యాంకులు మారడం సహజమే అయినప్పటికీ, దీన్ని పలు బాహ్య, అంతర్గత అంశాలు ప్రభావితం చేశాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి బలహీనపడటంతోనే ఈ పరిణామం జరిగిందని పలువురు చెప్తున్నారు.

అయితే, గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రూపాయి పతనమవడానికి గల అంతర్గత అంశాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం కప్పిపుచ్చలేం. గత ఆర్థిక సంవత్సరం నుంచి డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 శాతం వరకు పడిపోవడం కఠిన వాస్తవం. అదే సమయంలో జపాన్ కరెన్సీ యెన్, బ్రిటన్ కరెన్సీ పౌండ్స్ బలపడ్డాయి. ఇది ప్రధాన కారణంగా పైకి కనిపిస్తున్నా, వాస్తవానికి ఈ పతనానికి అంతర్గతంగా అనేక కారణాలున్నాయని చెప్పవచ్చు.

గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం అది 6.4 శాతానికి పడిపోయింది. అదే సమయంలో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, క్రమం గా ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లుతుండటం కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మరోవైపు దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది.

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో తయారీరంగంలో మందగమనం కొనసాగుతున్నది. గ్రామీణ భారతానికి జీవనాధారమైన వ్యవసాయం కునారిల్లుతున్న విషయా న్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాకింగ్ రంగంలో సంక్షోభాలు, తదిరత అంశాలు రూపాయి పతనమవడానికి కారణమయ్యాయని చెప్పక తప్పదు.

ఇవన్నీ కలగలిసి పరోక్షంగా నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్‌ను కిందికి లాగిపడేశాయి. అయితే ఈ లెక్కలు, ర్యాంకుల గోల ఎలా ఉన్నా, మానవాభివృద్ధి సూచీ, ఆకలి సూచీలో భారత్ మెరుగుపడి, సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరి, సంపద పంపిణీలో అసమానతలు తొలగినప్పుడే భారత్ పూర్తిస్థాయిలో ఆర్థికాభివృద్ధి సాధించినట్టు భావించాల్సి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.