రైతుల పరిస్థితి ఆధ్వాన్నంగా తయారైంది
- రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి, సంజయ్ సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్నారు
- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆధ్వాన్నంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రైతులు కష్టనష్టాలకు ఓర్చి వరి నాటు, వివిధ పంటలు వేసుకున్నారని, కానీ సరిపడా యూరియాను ప్రభుత్వం అందించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకరకంగా, కేంద్రం మరోరకంగా మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తూ.. బీఆర్‌ఎస్‌ను బద్నాం చేస్తున్నాయని మండిపడ్డారు.
బండి సంజయ్ ఇప్పటికైనా కేంద్ర మంత్రిగా ఉన్నాననే విషయం తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వేలాది టీఎంసీల నీళ్లు గోదావరిలో వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.






