కేంద్ర నిధులతోనే రాష్ట్రం నడుస్తోంది!
- కాంగ్రెస్ నేతలు చేతిలో చిప్పతో ఢిల్లీకి వెళ్తున్నారు
- కేంద్ర మంత్రులను నిధులు అడుగుతున్నారు
- కేంద్రం సాయంతో తెలంగాణలో రైతులు బతుకుతున్నరు
- సంగారెడ్డిలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సంగారెడ్డి, మే 3 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని, రాష్ట్రంలో రైతులు బతుకుతున్నారంటే కేంద్ర ప్రభుత్వమే కారణమని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన సంగారెడ్డి బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో నిధులు లేవని, నన్ను చీల్చినా ఒక్కపైసా రాదని సాక్షా త్తు సీఎం రేవంతే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కాంగ్రెస్ నేతలు చిప్ప చేతిలో పట్టుకుని నిధుల కోసం ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలుస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక్కడకు వచ్చి కేంద్ర ప్రభుత్వాన్నే విమర్శించడం సిగ్గు చేటన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారని విమర్శించడం సరికాదన్నారు. కాళేశ్వరం కూలిపోయాక తెలంగాణ లో ఇంకా ఎక్కువ పంట పండుతుందని, దేశంలోనే తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణకు దేశంలోనే ఎక్కువగా యూరియా కేటా యింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో పెట్రో ధరలు పెంచని ఏకైక దేశం భారతదేశమని కొనియాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు అధిక వాటాను కేటాయించిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.






