4 May, 2026 | 3:26 AM

భూసేకరణ పేరుతో.. లక్ష కోట్లకు ఎసరు!

04-05-2026 02:05 AM

ఫార్మా, ఫ్యూచర్ సిటీ పేరుతో అతి తక్కువ పరిహారంతో భూసేకరణ

  1. బడా వ్యాపారులకు ఎకరానికి రూ.2 కోట్లకు కట్టబెట్టే యత్నం 
  2. ఇప్పటికే 6 వేల ఎకరాల అసైన్డ్ భూమి రూ. 8 లక్షల చొప్పున సేకరించిన ప్రభుత్వం 
  3. ఫ్యూచర్ సిటీకి 30 వేల ఎకరాల భూసేకరణలో సర్కారు 
  4. అంతిమంగా నష్టపోయేది రైతులే 
  5. రైతులకు మేలు చేసే 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్న ప్రభుత్వాలు

* యాచారం దగ్గర ఫార్మా సిటీ ఉన్నది. 20 వేల ఎకరాలను సేకరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్పుడు 8,632 ఎకరాల భూములను దళితులకు అసైన్డ్ పట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రూ.2 కోట్లకు ఎకరం ఉన్న ఈ అసైన్డ్ భూములకు రూ.8 లక్షలు చేతుల్లో పెట్టి.. పప్పూ బెల్లాలకు గుంజుకున్నరు. కానీ ప్రైవేట్ కంపెనీలకు రూ.2 కోట్లకు అమ్ముకుంటుండు.

నేను అడుగుతున్నా.. ఈ భూమి కోసం కొట్లాడినవాళ్లను జైళ్లపాలు చేసిండు. యాచారం ప్రాంతంలో వస్తున్న ఫార్మాసిటీ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుని ఢిల్లీలో సోనియమ్మకు చెప్తా. సోనియమ్మ రాజ్యం వస్తది. సోనియమ్మ రాజ్యంలో మనకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన వస్తది.

 2023 ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడు 

రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీ బాధిత రైతులతో అన్న మాటలు

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): నిజమే.. పప్పులకు, బెల్లాలకు రైతుల నుంచి తీసుకున్న భూములను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు కట్టుబెడుతున్న తీరు కండ్లముందే కనిపిస్తున్నది. అభివృద్ధి పేరిట చట్ట విరుద్ధంగా రైతుల నుంచి తీసుకుంటున్న పచ్చని వ్యవసాయ భూముల ను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడంతో.. అంతిమంగా నష్టపోతున్నది ముమ్మాటికీ రైతులే. కానీ, ఈ భూసేకరణలో చిట్టచివరికి లాభపడుతున్నది ఎవరనేది ఇప్పుడు అదరినీ తొలుస్తున్న ప్రశ్న.

అయితే ప్రభు త్వం ఏదైనా.. రైతుల నుంచి సేకరిస్తున్న భూముల విషయంలో ప్రైవేటు కంపెనీలకు లాభం కలిగించేలా వ్యవహరించ డంతో పాటు తెరవెనుక భారీగా చేతులుమారేలా రాజకీయ నేతలు చూసుకుం టారని ప్రజలు, బాధితులు బాహాటంగా ఆరోపిస్తుండ టం గమనార్హం. అంతగా అయితే మీ భూములనే ఇవ్వొచ్చుగా అంటూ అధికార రాజకీయ పార్టీ నేతలను బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు.

సిటీ ఏదైనా.. పప్పు బెల్లాలకే..

అది ఫార్మా సిటీ కావచ్చు.. ఫ్యూచర్ సిటీ కావచ్చు.. రైతులకు దక్కేది పప్పు బెల్లాలే అనేది పుష్కరకాలంలో ప్రభుత్వాల తీరునుబట్టి స్పష్టంగా అర్థమవుతున్నది. 2016 నుంచి 2023 వరకు అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ఫార్మా సిటీ కోసం మొత్తం 19వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.8 లక్షలు, పట్టా భూమి కి రూ.12 లక్షల చొప్పున చెల్లించింది. సుమారు 6 వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూమిని సేకరించింది.

అనేక మంది రైతు లు భూసేకరణపై కోర్టులకు వెళ్లారు. ఇంత లో ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో భూసేకరణకు దిగింది. పట్టా భూములకు ఎకరానికి రూ.35 లక్షలకుపైగా ఇస్తామంటూ చెబుతున్నది. అయితే ఫార్మా సిటీని రద్దుచేస్తామని చెప్పిన కాంగ్రె స్ పార్టీ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన తరువాత.. ఫార్మా సిటీని రద్దు చేయకుండా.. కొత్తగా ఫ్యూచర్ సిటీ పేరిలో భూసేకరణను వేగవంతం చేసింది. ఇక్కడ కూడా రైతులకు పప్పు బెల్లాలే దక్కుతున్నాయి.

ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం..

ఇలా రైతుల నుంచి పప్పులు, బెల్లాలకు సేకరించిన పచ్చని భూములను అభివృద్ధిచేసి ఎకరానికి రూ.2 కోట్ల వరకు ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిం ది. భూసేకరణకు రైతులకు ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు చెల్లించిన ప్రభుత్వం.. ఆయా భూముల్లో రోడ్లు, విద్యు త్తు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను పూర్తిచేసి.. అనేక రకాలుగా సబ్సిడీ లు ఇస్తూ.. ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఎకరానికి రూ.2 కోట్ల వరకు అమ్ముకుంటున్నది.

ఇక్కడ రైతులకు ఇచ్చిన దానికంటే.. ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చేది కనీసం 5 నుంచి 7 రెట్లు ఎక్కువగా ఉంటున్నది. రైతులకు చెల్లించిన దాంతో పోల్చితే ప్రైవేటు కంపెనీలకు ఎక్కువ ధరకే భూము లు ఇచ్చినప్పటికీ మౌలిక వసతుల కల్పన, ఆపై కంపెనీలకు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల సబ్సిడీలు, టాక్స్ బెనిఫిట్లతో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకే లభించినట్టవుతుందని సామాజిక కార్యకర్తలు, బాధితులు పేర్కొంటున్నారు.

రూ.లక్ష కోట్లు ఎవరికి లాభం..

ఈ మొత్తం భూసేకరణ వ్యవహారంలో రైతులకు చెల్లించింది, ఆపై అభివృద్ధి చేసిన ఖర్చులు పోనూ ప్రభుత్వానికి కూడా పెద్దగా లాభం కనపడటం లేదు. అయితే తెర వెనుక రాజకీయ నేతలకు భారీగా లాభం ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.లక్ష కోట్ల వరకు ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు లాభం కలుగుతుందని, అది తిరిగి.. ప్రభుత్వ పెద్దలకు చేరుతుందని బాధితులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

30 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా, చట్టవిరుద్ధంగా సేకరించిన ప్రభు త్వం.. అదే భూములను ఎకరానికి రూ.2 కోట్లకు అమ్ముకుంటున్నది. అయితే ప్రైవేటు కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటే ఎకరానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ ధరకు కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తే ప్రైవేటు కంపెనీలు ఎలాంటి సంకోచం లేకుండా భూములను కొనుక్కుంటాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే రాయి తీలు, టాక్స్ బెనిఫిట్లు వస్తాయి.

పైగా వ్యాపా రం వృద్ధి అవుతుంది. కానీ, ఇక్కడ ప్రభుత్వమే ఎకరం రూ.2 కోట్లకే ఇస్తున్నదంటే అంతర్గతంగా ఎందుకంత తక్కువ ధరకు ఇస్తున్నదనే అనుమానం అందరికీ వస్తున్నది. ఇప్పుడు అందరినీ అదే ప్రశ్న తొలు స్తున్నది. వాస్తవానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూములను సేకరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మార్కె ట్ ధరకు సుమారు 4 రెట్లు రైతులకు చెల్లించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎకరం రూ.కోటి కంటే తక్కువ ధరకు దొరకడం లేదు.

ఇక హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న రంగారెడ్డి భూములంటే బంగారంతో సమానం. రోడ్డు సౌకర్యం ఉంటే గ్రామీణ ప్రాంతాలైనా రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ధర పలుకుతున్నది. కనీసం రూ.2 కోట్లు అనుకున్నా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.8 కోట్ల వరకు చెల్లించాల్సిందే. ఇదే ధరకు అమ్మినా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కానీ, ఎటొచ్చీ ప్రభుత్వంలోని పెద్దలకే ఎలాంటి లాభం ఉండదు. అందుకే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా 2016లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణల చట్టం ప్రకారం భూసేకరణ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రైతుకు దక్కాల్సిన ధరను, హక్కులను కాలరాసేలా ఈ చట్టాన్ని రూపొందించారని సామాజికవేత్తలు, కార్యకర్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.

అంతా తెరవెనుక వ్యవహారం..

రైతుల నుంచి అతి తక్కువ ధరకు సేకరించిన భూములను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీ లకు కూడా అతి తక్కువ ధరకే (మార్కెట్ రేటుతో పోల్చుకుంటే) ప్రభుత్వం కట్టబె డుతుందన్నమాట. అంటే తక్కువ ధరకు భూ ములు, అలాగే ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలకు దక్కే టాక్స్ బెనిఫిట్లు, మౌలిక వసతుల ఏర్పాట్లు, సబ్సిడీలు అన్నీ ప్రైవేటు కంపెనీలకు దక్కుతాయి. మరి అంతగా చేసిపెట్టిన ప్రభుత్వ పెద్దలకు ఏదో ఒక లాభం చేయాలనే ఆలోచన ప్రైవేటు కంపెనీలకు ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇలా 30 వేల ఎకరాల సేకరణ తరువాత ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిన అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ పెద్దలకు కిక్‌బ్యాక్ రూపంలో భారీగా ముడుపులు ముడతాయని బాధితులు, సామాజికవేత్తలు విమర్శి స్తున్నారు. ఈ మొత్తం సుమారు రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. ఒక్కో ఎకరం భూమి వారికి లభించే ధరకు వాస్తవంగా మార్కెట్‌లో ధరకు ఉన్న తేడా మొత్తం ప్రభుత్వం కీలకపాత్ర పోషించే వారికి అందుతుందని వారు గణిస్తున్నారు.

30 వేల ఎకరాలు.. ఒక్కో ఎకరానికి కనీసం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఇలా చేతులు మారే అవకాశం ఉంటుందని, ఈ లెక్కన మొత్తం రూ.లక్ష కోట్ల వరకు ప్రైవేటు కంపెనీల నుంచి కీలక వ్యక్తులకు చేతులు మారే అవకాశం ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు.

అంటే పప్పు, బెల్లాలను రైతుల చేతుల్లో పెట్టి.. అతి తక్కువ ధరకే ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాల భూములను అప్పగించి, ఆపై అక్కడి నుంచి అప్పనంగా భారీ మొత్తంలో కొల్లగొట్టేలా భూసేకరణ వ్యవహారం ఉందని బాధితుల ఆరోపణలను బట్టి అర్థమవుతున్నది. ఈ 30 వేల ఎకరాల భూసేకరణలో పూర్తిగా నష్టపోయేది రైతులైతే, చాలా లాభం కలిగేది ప్రైవేటు కంపెనీలకు.. ఇక అంతిమంగా రూ.లక్ష కోట్లు మాత్రం రాజకీయ నేతల చేతుల్లోకి వెళతాయని బాధితులు ఘంటాపథంగా చెబుతున్నారు.