31 May, 2026 | 1:02 AM

ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవ పోరు

31-05-2026 12:00 AM

పాపని నాగరాజు :

* ప్రజాస్వామ్యం అనేది ఎన్నికలు లేదా అధికార మార్పిడి వ్యవస్థ మాత్రమే కాదు. అది సామాజిక గౌరవం, సమాన అవకాశాలు, సౌభ్రాతృత్వం అనే విలువలపై నిలబడే ఒక ఉన్నతమైన జీవన విధానం. భారత రాజ్యాంగం రాజకీయ సమానత్వాన్ని హామీ ఇచ్చినప్పటికీ, ఆ సమానత్వం సామాజిక జీవితంలో ఎంతవరకు ప్రతిఫలిస్తోందనే ప్రశ్న నేటి రాజకీయ పరిణామాలు మళ్లీ మళ్లీ ముందుకు తెస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న అధికార కేంద్రీకరణ, హోదా ఆధారిత ప్రవర్తన, ప్రొటోకాల్ అసమానతలు ప్రజాస్వామ్య విలువలపై తీవ్రమైన చర్చను రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణ క్యాబినెట్ సమావేశం అనంతరం ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ చర్చకు ప్రతీకగా నిలిచాయి. ఒకవైపు మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతున్న సందర్భంలో సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేపర్లను వారి వైపు విసిరివేయడం, మరో వేదికపై మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్న సమయంలో మైక్ అర్ధాంతరంగా కట్ చేయడం వంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భంలో వేదికపై నియంత్రణ ఇలా మారిపోవడం వ్యక్తిగత ఘటన కంటే ఎక్కువగా, ప్రజాస్వామ్యంలో తోటివారి పట్ల ఉం డాల్సిన గౌరవ సంస్కృతి తగ్గిపోతున్నదనడానికి స్పష్టమైన సూచనగా అందరూ భావి స్తున్నారు.

ఈ ఘటనలు వేర్వేరుగా కనిపించినా, వాటి వెనుక ఒకే ధోరణి కనిపిస్తోంది. అధికార స్థానాల్లో పెరుగుతున్న హోదా ఆధా రిత అహంకారం, సహచర ప్రజాప్రతినిధుల పట్ల కనీస గౌరవం కూడా తగ్గించేలా చేస్తోం ది. ఇది ప్రజాస్వామ్య హుందాతనంపై ఆం దోళనను పెంచుతోంది. 

ఇది ఒక్కరోజులో ఏర్పడిన పరిస్థితి కా దు. తెలంగాణ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా ప్రొటోకాల్ అమలు, నిర్ణయ ప్రక్రియల్లో భాగస్వామ్యం, అధికార పంపిణీ వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు ప్రజాప్రతినిధులు మంత్రివర్గంలో, ఉన్నత హోదాల్లో ఉన్నప్పటికీ, కీలక నిర్ణయ ప్రక్రియల నుంచి ఉద్దేశపూర్వకంగా వారిని దూరంగా ఉంచుతున్నారనే భావన బలపడుతోంది. ఇది ప్రాతినిధ్యం ఉంది కానీ, ప్రభావం లేదనే కొత్త రాజకీయ వాస్తవాన్ని సూచిస్తోంది.

అదే సమయంలో దళిత-, బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల పట్ల ప్రొటోకాల్ లోపాలు, గౌరవ అసమానతలు, రాజకీయ వేదికల్లో చులకన ధోరణులు కూడా వివిధ సందర్భాల్లో చర్చకు వచ్చాయి. ఒక ప్రజాప్రతినిధి తన స్వయం గౌరవాన్ని బహిరం గంగా రక్షించుకోవడానికి ఆవేదన చెందాల్సిన పరిస్థితి రావడం, ప్రజాస్వామ్యంలో సామాజిక సమానత్వం ఇంకా సంపూర్ణంగా స్థిరపడలేదనే వాస్తవాన్ని సూచిస్తోంది.

ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ అసమానతలు ఏదో ఒకే కులానికి పరిమితం కాలేదు. బీసీ సమాజంలో ఉన్న పద్మ శాలి, ముదిరాజ్, మున్నూరు కాపు, గౌడ, యాదవ్ వంటి పెద్ద సామాజిక వర్గాలతో పాటు వివిధ ఉపకులాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా గౌరవం, ప్రొటోకాల్, నిర్ణయాధికారాల విషయంలో సమాన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇది బహుజన సమాజంలోనే కాదు, బహుజన రాజకీయ శక్తులలో కూడా ఐక్యత అవసరాన్ని మరింత స్పష్టంగా ముందుకుతె స్తోంది. ఈ పరిణామాలను విడివిడిగా చూ స్తే చిన్న రాజకీయ వివాదాలుగా కనిపించవచ్చు. కానీ, సమగ్రంగా చూస్తే అధికార కేంద్రీకరణ కొద్దిమంది ప్రభావశీల వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందనే భావన కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య సమతుల్యతపై సగటు పౌరుడు వేయవలసిన ప్రశ్న.

తెలంగాణ రాజకీయాల్లో సామాజిక నిర్మాణం, ప్రాతినిధ్యం, నిర్ణయాధికారాల పంపిణీపై జరుగుతున్న చర్చలు ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించేవి కావు; దానిని మరిం త లోతుగా అమలు చేయాలనే అవసరాన్ని సూచిస్తున్నాయి. అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదిగినా, సామాజిక గౌరవ అస మానతలు పూర్తిగా తొలగిపోలేదనే వాస్త వం ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో దళిత-, బీసీ ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యత రాజకీయ అవసరం మా త్రమే కాదు, ఒక చారిత్రక అవసరం కూడా. వారి అనుభవాలు వేర్వేరు అయినా, ప్రాతినిధ్యం, గౌరవం, నిర్ణయాధికారాల కోసం వారి పోరాటం ఒకే దిశలో సాగుతోంది. అయితే ఈ ఐక్యత ఇతరులపై వ్యతిరేకతగా కాకుండా, కులాధిపత్య భావజాలం తొలగిం చే దృష్టితో సమానత్వం కోసం ఒక నిర్మాణాత్మక శక్తిగా మారాలి.

మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ప్రొటోకాల్ అసమానతలు, వేదికల్లో మాట్లాడే అవకాశాల తగ్గింపు, మైక్ కట్ చేయడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య గౌరవంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇది లింగ సమానత్వం ఇంకా సంపూర్ణంగా స్థిరపడలేదనే వాస్తవాన్ని సూచిస్తోంది. అదే సమయంలో.. ఇదే స్థానంలో ఆధిపత్య కులాలకు చెందిన రాజకీయ మహిళలు మా ట్లాడుతున్నప్పుడు కూడా కొందరు ఇంతే నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారా? అన్న ప్రశ్న కూడా సామాజిక వర్గాల నుంచి నేడు ఉదయిస్తుంది.

మొత్తం మీద ఒకే నిజం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ ప్రజాస్వామ్యం విస్తరించి నా, సామాజిక ప్రజాస్వామ్యం ఇంకా అసంపూర్ణంగానే ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకపోతే, రాజకీయ ప్రజాస్వా మ్యం ఎక్కువ కాలం నిలబడలేదనే మాట నేటి పరిస్థితుల్లో మరింత ప్రాసంగికంగా మారింది.అందుకే ఈ చర్చను కేవలం వ్యక్తుల సమస్యగా కాకుండా వ్యవస్థాగత లోపంగా చూడాల్సిన అవసరం ఉంది. అధికార అహంకారం ప్రజాస్వామ్యానికి శత్రు వు; పరస్పర గౌరవం దాని ప్రాణం.

ప్రాతినిధ్యం మాత్రమే కాదు; గౌరవం, సమానత్వం, నిర్ణయాధికారాల వికేంద్రీకరణ కూ డా సమానంగా జరగాలి. అప్పుడే ప్రజాస్వా మ్యం కాగితాల మీద కాకుండా ప్రజల జీవితాల్లో నిజంగా నిలుస్తుంది. గౌరవం లేని ప్రాతినిధ్యం ప్రజాస్వామ్యం కాదు; అది ‘అధికార అలంకారం’ మాత్రమే అన్న విష యం పాలకులు మర్చిపోరాదు. గౌరవం లేని ప్రాతినిధ్యం ప్రజాస్వామ్యం కాదు,- అది అధికార అలంకారం మాత్రమే.