31 May, 2026 | 1:03 AM

ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేదెన్నడు?

31-05-2026 12:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా వారి ఉద్యమాలతోనే, వారి చేతుల మీదుగానే ప్రత్యేక రాష్ట్ర స్వప్నం ఆవిష్కృతం కావటం ఈ తరం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టంగానే భావించాలి. తెలంగాణ ప్రాంతానికి నిధులు-, నీళ్లు-, నియామకాల్లో జరిగిన వివక్షకు వ్యతిరేకంగా, ఆత్మగౌరవం, స్వయంపాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969లో 369 మంది ఉద్యమకారులు పోలీసు తూటాలకు బలై నేలకొరిగారు.

మలిదశ ఉద్యమంలో 1200 మంది ఉద్యమ కారులు తృణప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం తన ప్రయాణంలో పుష్కరకాలం పూర్తిచేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ కానీ సమైక్యాంధ్ర పాలకుల చేతిలో నిధులు, నీళ్ల వాటాలో, నియామకాల్లో, అధికారంలో, ఆత్మగౌరవంలో తీగలు తెగిన వీణలాగా మారిపోయిన నేపథ్యంలో జయశంకర్ సార్ చెప్పినట్లు ఎట్టికైనా మట్టికైనా మనవాడై ఉండాలని ప్రజా ఉద్యమాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

58 సంవత్సరాలు కొనసాగిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్యలకు ముఖ్యమంత్రులుగా అవకాశం దక్కితే, ఒక్క జలగం వెంగళరావుని తప్ప ఏ ముఖ్యమంత్రిని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగకుండా కుట్రలు చేశారు.

అలాగే తెలంగాణ ఏర్పడే తరుణంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఇంకా చివరి బాల్ మిగిలే ఉందని చెప్పిన మాట నాడు రాష్ట్ర ఏర్పాటుకి ఆంధ్రా లాబీయింగ్ ఏ స్థాయిలో మోకాలడ్డిందో తెలియజేస్తున్నది. అన్ని అవరోధాలను అధిగమించి, కుట్రలను ఛేదించి ప్రజా ఆకాంక్షల మేరకు ప్రజా ఉద్యమాలతో 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. 

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం -2014లో నాటి యూపీఏ ప్రభుత్వం విభజన వలన రెండు రాష్ట్రాలు నష్టపోకుండా, అభివృద్ధి చెందడానికి అనేక హామీలు ఇచ్చిం ది. రెండు రాష్ట్రాలుగా విడిపోయి పుష్కర కాలం అవుతున్నా నాటి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చ టంలో మరొకసారి తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం కలుగుతున్నది. ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖ రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి నిధులు ఆలస్యమైనా విడుదల చేస్తూనే ఉన్నారు.

కానీ, తెలంగాణ విషయానికి వచ్చేసరికి హామీల అమల్లో ఆశించిన స్థాయిలో అడుగులు పడటం లేదు. ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, ఐఐఎం, ఐటీఐఆర్ కారిడార్, రైల్వే డివిజన్ ఏర్పాటు, మెట్రో విస్తరణ, ప్రాజెక్టులకు జాతీయ హోదా, నిధుల కేటాయింపు తదితర అనేక కీలకమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపులు జరగకపోవటంతో కొంతమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. 

స్వరాష్ట్రంలోనూ రైతులకు తప్పని కష్టాలు 

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు కావడంతో దేశంలోనే ఒక అత్యుత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందటానికి తెలంగాణకు అవకాశం దక్కింది. ఈ పుష్కర కాలంలో తెలంగాణ రాష్ట్రం రూ.18 లక్షల కోట్ల జీఎస్డీపీతో, రూ.4.19 లక్షల తలసరి ఆదాయంతో గణనీయ మైన ప్రగతి సాధించింది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రాష్ట్రంలో అత్యధికంగా 47 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగంలో ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా వరి ఉత్పత్తి, ఉత్పాదకతలో పంజాబ్‌ను అధిగమించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచే దిగుబడి సాధించినా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడటం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఈ ప్రాంతంలో కొనసాగిన రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గటం కొంత ఉపశమనం కలిగించే అంశమే.

మరొక ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే కార్పొరేట్ సంస్థలు, విదేశాల నుంచి తెలంగాణ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నా, ఆశించిన స్థాయిలో స్థానిక యువతకి, ప్రొఫెషనల్స్‌కి ఉద్యోగ అవకాశాలు  కల్పించలేకపోవటం. ఉద్యమ ఆకాంక్ష అయిన ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందడంతో యువతలో నిరుద్యోగుల్లో నిరాశ,  నిస్పృహలు అలుము కుంటున్నాయి.

గత ప్రభుత్వం 1.64 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తుండగా, ఈ ప్రభుత్వం 67 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అంటున్నది. అంటే ఈ పుష్కర కాలంలో రెండు ప్రభుత్వాలు 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశాయి. ఇందుకు భిన్నంగా 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకే నోటిఫికేషన్‌లో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసింది. 

ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాటైన తరువాత కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, కార్పొరేట్, ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తామని, ప్రతి కుటుంబానికి ఉచిత కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెస్తామని ఉద్యమ నాయ కత్వం హామీ ఇచ్చింది. కానీ, ఈ పుష్కర కాలంలో  విద్య, వైద్యం మరింత ఖరీదైనవిగా మారడమే కాదు, ఈ రెండు రంగాల్లో ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల జోక్యం పెరిగింది. ఈ రంగాలు దోపిడీ వ్యవస్థలుగా మారినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం దారుణం.

రూ.3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 8.2 శాతం, ఆరోగ్య రంగానికి 4.2 శాతం నిధులే కేటాయించడంతో కింది వర్గాల ప్రజల వరకు వీటి సేవలు చేరడం లేదు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు కూడా మారడంతో విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలతో పాటు ఉద్యోగాల కల్పనలో కూడా ప్రజలు ఆశించిన అంచనాలను రాష్ట్రం అందుకోలేకపోయింది. అంతేకాదు, వారస త్వంగా ఏపీ నుంచి వచ్చిన అప్పులకు అదనంగా 12 ఏళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వాలు రూ.9 లక్షల కోట్ల అప్పు చేయటం ఆందోళనకరం. 

తెలంగాణను కించపరిచేలా వ్యాఖ్యలు 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ తర్వాత కూడా ఆంధ్ర నాయకుల కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయని అనుమా నాలు కలుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేదికపై నుంచి తెలంగా ణకు చెందిన ఆ పార్టీ నాయకులు తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడ ఉందని వ్యాఖ్యానించటం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి.

తెలంగాణలో కూడా తమ పార్టీని విస్తరిస్తామని లోకేష్ ప్రకటించడం, మరొకవైపు రాష్ట్ర విభజనని దేశ విభజనతో పోల్చటం, మెడపట్టి గెంటివేస్తే కట్టుబట్టలతో వచ్చామని మాట్లాడటం తెలంగాణ పోరాటాన్ని కించపరిచేలా, ఆత్మగౌ రవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం అంటే యుద్ధమే అనే రణ నినాదాన్ని మరిచి చాప కింద నీరులాగా  హైదరాబాద్‌ను యూటి చేయాలనే ప్రతిపాదన తెరపైకి తేవటం, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరితో సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు తెలంగాణపై మరొకసారి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారనే భావన సామాన్య ప్రజల్లో కలుగుతున్నది.

తెలంగాణను కాపాడుకునే తెగువ, ప్రశ్నించే తత్వం ఈ మట్టి స్వభావం. కాబట్టి ఎలాం టి కుట్రలనైనా ఛేదించే నేర్పు ఉద్యమస్ఫూర్తి తెలంగాణ ప్రజలది. ఈ పుష్కరకాలంలో తెలంగాణలో పాలకులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికే ప్రయత్నించారు.

కానీ, ప్రజల కేంద్రంగా, ప్రజల కోసం పాలన జరగలేదనేది విస్పష్టం. కాబట్టి పార్టీలు, ప్రభుత్వాలు రాజకీయాల కంటే రాష్ట్రం అభివృద్ధి, ప్రజల సంక్షే మంపై దృష్టిపెట్టి పనిచేసినప్పుడే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఉద్యమకారుల త్యాగాలకు గౌరవం దక్కు తుంది. ‘జై తెలంగాణ’ ఒక ఉద్యమ నినాదం మాత్రమే కాదు, దాన్ని ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణగా చూడాలి. 12 వసంతాలు పూర్తిచేసుకోబోతున్న పుష్కర పుడమి తెలంగాణ తల్లికి శతాధిక వందనాలు.

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

 వ్యాసకర్త సెల్: 9885465877