31 May, 2026 | 12:34 AM

ప్రణాళిక లేని సాగు!

31-05-2026 12:00 AM

వానకాలానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ సాగు అంచనాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగా నే ఈ ఏడాది కూడా 1.34 కోట్ల ఎకరాల్లో సాగును అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం; 69.50 లక్షల ఎకరాల్లో వరి, 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు ప్రాధాన్యమిస్తూ విత్తనాలను సిద్ధం చేయడమే ఇందుకు కారణం. ఈ క్రమం లో ఎల్ నినో ప్రభావాన్ని ప్రభుత్వం విస్మరించడం శోచనీయం. ఇప్పటికే నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితు లు ఏర్పడటాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

వాతావరణ పరిస్థితుల మూలం గా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వానలు తక్కువగా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనూ పాత విధానాన్ని కొత్తగా నెత్తికెత్తుకోవడం; మక్క, కంది, పెసర్లు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది. తెలంగాణలో బోర్లు, బావుల ఆధారిత ఎవుసం ఎక్కువగా సాగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వానలు సమృద్ధిగా కురిసి; బోర్లు, బావులు పొంగిపొర్లి; చెరువులు మత్తళ్లు దుంకితేనే తెలంగాణలో జోడెడ్లు ముందుకుసాగుతాయి. లేకపోతే అన్నదాత కాడివదిలేయాల్సి న దుస్థితి దాపురిస్తుంది. వరికి ఎక్కువ నీరు అవసరం. పత్తికి తొలి దశలో కనీసం తేమ లేకపోతే విత్తు విచ్చుకోదు. అంతేకాదు, ఒకే పంటను ఎక్కువకాలం సాగుచేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల నేలలోని కీలక పోషకాలు తగ్గిపోయి పురుగులు, తెగుళ్ల సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

అందుకే పప్పుధాన్యాలు, నూనెగింజలు, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఇతర పంటల సాగు ఇప్పుడు అవసరం. ముఖ్యంగా తెలంగాణలోని పరిస్థితుల దృష్ట్యా మన రాష్ట్రంలో పంటల మార్పిడి అనివార్యం. ఈ దిశగా రైతులను ప్రభుత్వమే ప్రోత్సహించాలి. కానీ, సంక్షోభ సమయంలోనూ సర్కార్ ప్రణాళిక మారడం లేదు. రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తిచూపడం లేదన్నది వాస్తవమే.

వరి పంటకు ఉన్న కొనుగోలు భరోసా ఇతర పంటలకు లేకపోవడం, ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ సదుపాయాలు కొరవడటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. యాసంగి సీజన్‌లో పండిన ధాన్యం ఇంకా కల్లాల్లోనే మగ్గుతున్నా రైతులు మళ్లీ వరివైపే మొగ్గుచూపడం దీనికి నిదర్శనం. మొత్తంగా దీర్ఘకాలికంగా రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే పంటసాగులో వైవిధ్యం అవసరమని చెప్పక తప్పదు.