గుప్త నిధుల కోసమే ఆలయం కూల్చారు
- లంక బిందెల వేటలో 24 అడుగుల తవ్వకాలు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
- అశోక్‌నగర్‌లో ధ్వంసమైన మట్టికోట శివాలయం పరిశీలన
మహబూబాబాద్, మే 11 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఖానాపురం మండ లం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కూల్చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన 800 ఏళ్ల నాటి శివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూల్చేశారని ఆరోపించారు. ‘ఆలయ రక్షణ కోసం ఉన్న అతిపెద్ద మట్టి ఆనకట్టను తొలుచుకుంటూ వెళ్లి మరీ గర్భగుడిని ధ్వంసం చేశారు.
రాత్రి 12 నుంచి 1 గంట మధ్య, చీక ట్లో గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారు. స్కూల్ కట్టే పనైతే పగలు చేయొచ్చు కదా? అర్ధరాత్రి ఎందుకు తవ్వారు? గుప్త నిధుల వేటలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ కుట్ర జరిగింది. ఇది గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకమే అని పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి గారు ఈ నెల 7వ తేదీన కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆర్కియాలజీ అధికారి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ కాలేదు, మిషనరీ సీజ్ చేయలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.
అంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది స్పష్టం’ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో బడులు ఆగమే కాదు.. ఏకం గా గుడుల విధ్వంసం కూడా జరుగుతోందన్నారు. పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బాధ్యులను అరెస్ట్ చేసి మిషనరీని సీజ్ చేయాలని, యుద్ధప్రాతిపదికన ఈ చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలని కోరారు.
కాగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పిలిస్తే.. అన్నీ 4.86%, 4.96%, 4.99% ఎక్సెస్ కే ఇచ్చారని ఆరోపించారు. ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా 494 కోట్ల ఒక లక్ష రూపాయల ఎక్సెస్ అ మౌంట్ ద్వారా ప్రజాధనం లూటీ అయ్యిందన్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్ ఉన్నారు.






