ఐవోఈ కళాశాలలుగా 3 కేజీబీవీలు
బయ్యారం, గూడూరు, మహబూబాబాద్ కేజీబీవీల ప్రకటన
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు
మహబూబాబాద్, మే 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో మూడు కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ కళాశాలలుగా ప్రకటించారు. జిల్లాలోని బయ్యారం, గూడూరు, మహబూబాబాద్ కేజీబీవీలను ఐ ఓ ఈ గా ప్రకటించి ప్రత్యేకంగా ఈ విద్యా సంవత్సరం నుంచి బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.
మిగతా కేజీబీవీల్లో నేరుగా ప్రవేశం కల్పిస్తుండగా ఇందులో అలా కాకుండా, ఈ మూడు కేజీబీవీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈనెల 3న ఈ మూడు కేజీబీవీల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించారు. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థినులకు త్వరలో ప్రవేశం కల్పిస్తారు. ఐఓఈ విద్యా విధానం అమలు చేసే మూడు కేజీబీవీల్లో మూడు విధాల విద్యా బోధన కొనసాగనుంది. కేజీబీవీ మహబూబాబాద్ కేజీబీవీ లో విద్యార్థులకు నీట్ మెడికల్ కోచింగ్ ఇస్తారు.
ఇందులో ఇంటర్మీడియట్ బైపీసీ విద్యా బోధన సాగుతుంది. కేజీబీవీ గూడూరులో ఐఐటీ / జేఈఈలో ప్రవేశం కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తారు. ఇందులో ఎంపీసీ విద్యాబోధన సాగుతుంది. కేజీబీవీ బయ్యారంలో సీ ఈ సీ, ఐ ఓ ఈ కోచింగ్ ఇస్తారు. క్లాట్, లా ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేకంగా విద్యాబోధన సాగుతుంది. ఐ వో ఈ అమలు చేసే కేజీబీవీల్లో ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా మెరిట్ సాధించి ప్రవేశం పొందిన బాలికలకు ఇంటర్మీడియట్ విద్యా బోధనలతో పాటు అనుభవజ్ఞులైన సబ్జెక్ట్ నిష్ణాతులచే ప్రత్యేక కోచింగ్ అందిస్తారు.
పోటీ పరీక్షలకు సంబంధం చేసే విధంగా ప్రత్యేకంగా అవగాహన, ప్రత్యేక అకడమిక్ ప్లానింగ్, స్టడీ మెటీరియల్, నిరంతరం పరీక్షల నిర్వహణ ఉంటుంది. బాలికలకు ఉచిత రెసిడెన్షియల్ హాస్టల్ వసతి కల్పన భోజనం, డిజిటల్ లెర్నింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ప్రత్యేక స్టడీ అవర్స్, మెంటరింగ్ సదుపాయాలు ఉంటాయి. మహబూబాబాద్ జిల్లాలో మూడు కేజీబీవీల్లో నిర్వహించే ఐ ఓ ఈ విద్యా విధానం బాలికల విద్యాభివృద్ధికి మరింత దోహదపడనుంది.






