కలుపుగోలు నేతకు కలిసొచ్చిన కాలం!
రామచందర్ రావు ఎంపిక వెనుక బీజేపీ పెద్దల వ్యూహం
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : ఏబీవీపీ విద్యార్థి నాయకునిగా, పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన నేతగా.. పార్టీకి అత్యంత విధేయునిగా ఉండడమే మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికయ్యేందుకు మార్గం సుగమం చేసింది. ఇటీవల పార్టీలో చేరిన వారికి పట్టం కట్టేందుకు బదులుగా జాతీయ నాయకత్వం చాలా కాలంగా కాషాయదళంలో ఉన్న నేతకే పట్టం కట్టింది.
ప్రముఖ క్రిమినల్ న్యాయవాదిగా పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న వ్యక్తిగా ఆయన పార్టీలో అందరి వాడుగా గుర్తింపు పొందారు. దివంగత నేత అరుణ్ జైట్లీకి సన్నిహితునిగా ఆయనకు పార్టీలో విస్తృతమైన సంబంధాలున్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగానూ పనిచేశారు. ఆయనను పార్టీ అధ్యక్షున్ని చేయబోతున్నట్లుగా ముందుగానే పార్టీ నాయకత్వం రాష్ట్ర నాయకులకు సమాచారం అందించింది.
అయితే రామచందర్ రావును అంత సులభంగా అధ్యక్ష పదవి వరించలేదు. ఢిల్లీలో అనేక మంది ఆశావహులు, ముఖ్యం గా ఎంపీలు అధిష్ఠానంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. పెద్దఎత్తున లాబీయింగ్ కూడా చేశారు. అం దుకే అధ్యక్ష ఎన్నిక ఆలస్యమైంది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం ఉంటారని అధిష్ఠానం బహిరంగంగానే ప్రకటించింది.
కానీ పార్టీ 8 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం అయ్యింది. బీసీ సీఎం అన్నా కనీసం బీసీలకు బీజేఎల్పీ కూడా దక్కలేదు. అందుకే ఇప్పుడు బీసీ నాయకుల్లో ఎవరో ఒకరు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికవుతారని అంతా భావించారు. పీసీసీ చీఫ్‌గా బీసీ నాయకుడైన మహేష్ గౌడ్‌ను ఎంపిక చేయడంతో, బీజేపీ అదే బాట పడుతుందని భావించారు. ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్ వంటి నాయకులు ఆ జాబితాలో ఉన్నట్లు కనిపించింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కూడా అవకాశం వస్తుందని ఆయన మద్దతుదారులు భావించారు. కానీ అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని దూకుడుగా అడ్డుకునేందుకు సీఎం జిల్లాకే చెందిన ఎంపీ డీకే అరుణకు అవకాశం వస్తుందని భావించారు. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగిం చాలని కూడా మరో వర్గం ఆశించింది. కానీ రెడ్లకు పదవి ఇస్తే బీసీలతో పేచీ వస్తుందని.. అలా కాదని బీసీలకు ఇస్తే రెడ్లతో తలనెప్పి వస్తుందని అధిష్ఠానం భావించింది.
మరోవైపు బీసీల్లో ఒకరికి ఇస్తే మరో సామాజిక వర్గం, గ్రూపులతో పార్టీకి ఇబ్బందులు వస్తాయనీ భావించారు. మరోవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎక్కువకాలం కొనసాగిన వారికి పదవిని ఇస్తే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారిలోనూ అసంతృప్తి వస్తుందని.. ఈ నేపథ్యంలోనే పార్టీకి విధేయుడై నా, పార్టీలో అందరితోనూ సఖ్యతగా ఉండే రామచందర్ రావు దిశగా అధిష్ఠానం ఆలోచన సాగినట్లు తెలుస్తోంది.
బండి సంజయ్ లా రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయకపోయినా.. ఈటల రాజేందర్, డీకే అరుణలా ప్రజాదరణ లేకపోయి నా ఆయన పార్టీలో అందరినీ కలుపుకు పోవడంలో మాత్రం విజయం సాధిస్తారని పార్టీ నమ్మింది. అయితే ఆయన కట్టర్ హిందువు కాదని ఎవరూ అనలేరు. ఆయన పోరాడి గెలిచిన కేసుల్లో 2007లో హైదరాబాద్‌లో జరిగిన మక్కా మసీదు పేలుళ్ల కేసులో స్వామి అసిమానందను నిర్దోషిగా విడుదల చేయడం కూడా ఒకటి.
రామచందర్ రావుకు అనుకూలంగా మారిన మరో అంశం.. ఆయన హైదరాబాద్‌కు చెందిన నాయకుడు కావ డం వల్ల త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆయన విజయవంతంగా పార్టీకి అవకాశం దక్కేలా చేస్తారని కూడా అధిష్ఠానం నమ్మినట్లు తెలుస్తోంది. ఇక అన్నింటి కన్నా ఎక్కువగా అంశం ఏమిటంటే.. రామచందర్‌రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా మూడేళ్లు ఉంటారు. ఆ తర్వాత దాదాపు ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయి.
రామచందర్‌రావును కొనసాగిస్తూ, పార్టీలోని బీసీ నాయకుణ్ణి సీఎం అభ్యర్థిగా ప్రకటించే వీలుంది. ఈలోగా పార్టీలోని నాయకులంతా రామచందర్‌రావుకు సహకరించకుండా ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది. దీన్నే ఆయన అస్త్రంగా మార్చుకుని పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేసి తనను తాను నిరూపించు కునేందుకు అవకాశం లభిస్తోంది.
ఇక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి వచ్చే అసంతృప్తులను పార్టీలో కలుపుకోవాలన్నా, సమీకరణాలు మారితే తెలంగాణలో టీడీపీ, జనసేనలకు స్నేహహస్తం అందించాలనుకున్నా రామచందర్ రావుకు ఎలాంటి భేషజాలు ఉండకపోవచ్చు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచు కొని బీజేపీ అధిష్ఠానం రామచందర్‌రావు వైపు మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది.






