18 April, 2026 | 2:34 PM

రామాయణ పరమార్థమే యోగ సాధన!

19-10-2025 12:00 AM

డాక్టర్ వెనిగళ్ల రాంబాబు :

రేపు శేషేంద్ర శర్మ జయంతి సందర్భంగా.. :

ముత్యాల ముగ్గు సినిమాలో శేషేంద్ర రచించిన ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అనే గీతం గుండెల్ని పిండి వేస్తుంది. ఆ సినిమాలో వంచనకు గురైన కథానాయకను సీతాదేవితో పోల్చిన విధానం చూస్తే రామాయణమంటే వీరికెంత మమకారమనేది తెలుస్తుంది. 

ఈనాడు విభిన్న దేశాలను ఏకం చేస్తూ విశ్వసంచారం చేస్తున్న యోగా భారతదేశంలోనే ఉద్భవించింది. ప్రపంచ మానవాళి శారీరక, మానసిక, ఆరోగ్య పరిరక్షణకై యోగా ఉద్యమించిం ది. ఇంతటి యోగాకు అగ్రాసనం వేయడ మే రామాయణ రచనలో విశ్వకవి వాల్మీకి అంతరంగమని శేషేంద్ర శర్మ తన ‘షోడశి’ గ్రంథంలో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మానవ శరీరంలో నిద్రాణమై ఉండే శక్తిని యోగ సాధన ద్వారా జాగృతం చేసే కుం డలినీ యోగ విద్యను ప్రత్యక్షంగా, పరోక్షంగా రామాయణ కథాంశంలో వాల్మీకి మహర్షి పొందుపరచిన రహస్యాన్ని శేషేం ద్ర ఈ గ్రంథంలో ఆవిష్కరించారు.

ఈ కుండలినీ యోగంలో అధిష్టాన దేవత అయిన లలితా పరమేశ్వరి అమ్మవారికి మరో పేరే ‘షోడశి’. అభ్యుదయ సారస్వత జగత్తులో అనితర సాధ్యమైన సాహితీ ప్రక్రియలతో ప్రభంజనాలు సృష్టించిన మహాకవిగా లబ్ధప్రతిష్టులైన గుంటూరు శేషేంద్ర శర్మ.. ఆర్ష వాజ్ఞయాన్ని ఔపోసన పట్టిన సంస్కృత పండితులు, మహా దార్శనికులు. ముత్యాలముగ్గు సినిమాలో శేషేం ద్ర రచించిన ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.

కన్నుల్లో నీరు తుడిచి క మ్మని కల ఇచ్చింది’ అనే గీతం గుండెల్ని పిండి వేస్తుంది. ఆ సినిమాలో వంచనకు గురైన కథానాయకను సీతాదేవితో పోల్చి న విధానం చూస్తే రామాయణమంటే వీ రికెంత మమకారమనేది తెలుస్తుంది. ఆ ఊహ నిజమే. రామాయణంలోని మంత్ర, తంత్ర రహస్యాలను, వాల్మీకి రచనా వైశిష్ట్యాన్ని విశ్లేషిస్తూ 1965లో ఆంధ్రప్రభలో ధారావాహికంగా రాసిన  వ్యాస పరంపర తర్వాత గ్రంథ రూపాన్ని సంతరించుకుం ది.

రాముని విష్ణుమూర్తి అవతారంగా కాక కేవలం ఉత్తమ మానవునిగా మాత్రమే వాల్మీకి చిత్రించారని శేషేంద్ర తెలిపారు. రాజ్యం పోయి, భార్య పోయి, అడవులపా లై శత్రువుల బారిన పడినా, శ్రీరాముడు పరమేశ్వరుడని చెప్పి ఆ కష్టాల్ని తప్పించాలనే లోభానికి లొంగిపోలేదని, కొన్ని చోట్ల విష్ణువు పేరు వచ్చినప్పటికీ అది కేవలం పరాక్రమానికి ఉపమానంగానే తెచ్చారని.. అక్కడే వాల్మీకిలో కవిత్వం, ఋషిత్వం కలగలిసిన నిగ్రహం జయించిందన్నారు.

రామాయణ వృత్తాంతాలు

వాల్మీకి రామాయణాన్ని, ఇతర ఆధ్యాత్మిక రామాయణాలను, బ్రహ్మాండపురా ణం, ఉపనిషత్తులు, దేవీభాగవతం వంటి ఇతర సారస్వతంలోని రామాయణ వృత్తాంతాలనూ పరామర్శించారు. షోడశి ఏదో  పామరుజన పారాయణ గ్రంథమో, పురాణ ప్రవచనమో కాదు. ఇది పండితారాధ్యులు సైతం నివ్వెరపడేంత పరమ ప్రామాణిక రచన కావటం విశేషం. రామాయణానికి హృదయంగా భావించే సుంద రకాండలో ఉన్నది సాంకేతిక పరిభాషలో నిగూఢంగా నిక్షిప్తమైన కుండలినీయోగమేనని శేషేంద్ర నిర్ధారించారు.

మానవ శరీ రంలో వెన్నెముకలో ఉండే అనిర్వచనీయమైన శక్తి కుండలిని. మూలాధార చక్రంలో నిద్రాణమై ఉండే ఈ శక్తిని ఉత్తేజితం చేసి సుషుమ్నానాడి ద్వారా తలపైకి అంటే సహస్రారం వరకు చేర్చడమే కుండలినీ యోగం. ఇక్కడ లంక మూలాధారమని, హనుమంతుడు సుషుమ్ననాడీ అని, సీతాదేవి కుండలినీ అధిష్టాన దేవత అని, రావణుని కైవల్యమే సహస్రారమని వివరించారు. హనుమత్ , సుషుమ్న శబ్దాలు కూడా సమానార్థకాలని నిరూపించారు.

శేషేంద్ర ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశోధించి వెలికి తీసిన మరో అనర్ఘరత్నం త్రి జటా స్వప్నం. ఈ వృత్తాంతంలో వాల్మీకి నిక్షిప్తం చేసింది గాయత్రీ మంత్రమే. అం దుకే ఆ మంత్రరాజాన్ని హారంలో మణి మకుటంగా మధ్యలో వచ్చేలా ఏర్చి కూ ర్చారు. రామాయణంలోని 24 వేల శ్లో కాల్లో సరిగ్గా మధ్యలో వచ్చేలా, అంటే 12 వేల శ్లోకాల తర్వాత ఈ వృత్తాంతం వ స్తుంది.

గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరాన్ని ప్రారంభంగా తీసుకొని వాల్మీకి రా సిన శ్లోకాలను శేషేంద్ర గుర్తించారు. సీతారాములను శివశక్తి స్వరూపాలుగా వాల్మీకి దర్శించారని, లలితా సహస్రనామాలు, ల లితా త్రిశతిలోని అనేక పథ బంధాలతో ఆ మెను ప్రస్తావించారనేది ఉదాహరణ.

మేఘ సందేశం

కాళిదాస మహాకవి వాల్మీకి మానస పుత్రుడని, వాల్మీకిలోని ఉపమాలంకార వైభవాన్ని గ్రహించి రఘువంశ కావ్యాన్ని, అర్థాంతరన్యాసాన్ని స్వీకరించి మేఘసందేశాన్ని రాశారు. వాల్మీకి మహర్షి రచనలో నిగూఢమైన అంతరార్థాలను ఆవిష్కరించడంలో శేషేంద్ర పాండితీప్రకర్ష బహిర్గత మవుతుంది. రావణుడు సీతతో ఆమె సౌందర్యం తనను ఆకర్షించిన విధానాన్ని చెబుతూ ‘మనోహరసి మే భీరు సుపర్ణః పన్నగం యథా’ అంటాడు.

అంటే గరుత్మంతుడు సర్పాన్ని హరించినట్లుగా ను వ్వు నా మనస్సును హరిస్తున్నావు. ఇది ఆ సందర్భానికి తగిన రమణీయమైన శక్తివంతమైన ఉపమానం. అలంకారం అద్భు త మే కానీ దీని పరమార్ధం అది కాదు. ఇ క్కడ అంతర్లీనంగా ధ్వని కూడా ఉంది. గ రుత్మంతుని చేత చిక్కిన సర్పం చావడం త థ్యం. అంటే ఈ సందర్భంలో వాల్మీకి రావణుడి భవిష్యత్తును కూడా సూచిస్తున్నాడు. అది కూడా మళ్ళీ అదే రావణు  నితో చెప్పించడమే చమత్కారం.

ఉపనిషత్ పరిభాషలో.. సుపర్ణ అంటే పరమాత్మ ,పన్నగం అంటే మనస్సు అని అర్థాలు న్నాయి. పరమాత్మ మనస్సును హరిస్తే ఆత్మ సాక్షాత్కారమవుతుంది. మోక్షం సిద్ధిస్తుంది. అంతిమంగా రావణుని జన్మ పర మార్థం కూడా అదే కదా. వాల్మీకి స్వయం గా మహర్షి కావటం వల్ల ఇటువంటి నిగమాగమ భాష అప్రయత్నంగా దొర్లుతూ ఉంటుందని శేషేంద్ర అభిమతం.

‘షోడశి’ విశ్వసంచారం       

లోక వ్యవహారంలో ఉన్న ఒక భావన ను శేషేంద్ర సవరించి మరింత ఉన్నతార్థాన్ని అందిస్తున్నారు. సీత గడ్డి పోచను అడ్డుగా చేసుకుని రావణుడితో మాట్లాడినట్లు ‘తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మితా’ అని రామాయణంలో ఉంది. రావణున్ని తృణప్రాయంగా అంటే గడ్డిపోచతో సమానమని ఆమె భావించిందని మనం ఊహిస్తున్నాం. అయితే శేషేంద్ర దృ ష్టి వేరు. తృణం పాపాలను హరించి పవిత్రత కలిగిస్తుందని శృతి వాక్యం.

అందుచేత రావణునితో మాట్లాడటం వల్ల కలిగిన పాపం ఈ తృణంతో శమింపబడుగాక అనేది సీతాదేవి అంతరంగమని శేషేంద్ర వివరించారు. రామాయణ, భారతాల మ ధ్య ఉన్న బింబ, ప్రతిబింబ సాదృశ్యాలు, వేదాల్లో విష్ణువు, ఇంద్రుని ప్రస్తావనలు, దేవీస్తోత్ర రహస్యాలెన్నింటినో ఆయన చర్చించారు. ఇలా అంతుచిక్కని ఎన్నెన్నో  రామాయణ రహస్యాలను వెలికి తీసిన శేషేంద్ర ‘షోడశి’ అంతర్జాతీయ యోగా దినోత్సవ సాక్షిగా నేటికీ విశ్వసంచారం చేస్తూనే ఉంది.

 వ్యాసకర్త సెల్: 9848044329