ట్రంప్ ప్రేలాపనలు!
అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్ ఆహార్యం సంగతి ఎలా ఉన్నా మాట తీరులో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఈ మధ్యన అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో విసుగు తెప్పిస్తున్నారు. తాజాగా భారత్.. రష్యా వద్ద చమురు కొనుగోలు చేయడం ఆపేస్తుందని, ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా తనకు చెప్పారని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అసలు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలన్న విషయం లో ఇరు దేశాల నేతల మధ్య ఫోన్ సంభాషణలు జరగలేదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారత్ ఖండించినా ట్రంప్ మరోసారి అవే వ్యాఖ్యలు చేయడం ఆయన మూర్ఖత్వానికి పరాకా ష్ట. అయితే భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ట్రంప్‌కు కొత్తేమీ కాదు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనంటూ ట్రంప్ దాదాపు 50 సార్లు చెప్పుకొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన భారత్.. పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతోనే యుద్ధం ఆపామని, ఇందులో ట్రంప్ ఘనత ఏమీ లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. అంతేకాదు భారత్, పాక్‌లు యుద్ధం ఆ పకపోతే 200 శాతం టారిఫ్ విధిస్తానని ట్రంప్ బెదిరింపులకు దిగారు.
అయితే భారత్ మాత్రం యుద్ధం ఆపడం వెనుక ట్రంప్‌కు క్రెడిట్ ఇవ్వకపోవడంతో దానిని మనసులో పెట్టుకొని మనపై టారిఫ్‌ను 50 శాతానికి పెంచారనిపిస్తుంది. పైగా రష్యాతో ముడి చమురు వ్యాపారం చేస్తున్నందు కే భారత్‌పై టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ కలరింగ్ ఇచ్చుకున్నారు. ఇక్కడ వాస్తవమేమిటన్నది ఒక్క ట్రంప్‌కు తప్ప అందరికీ అర్థమయ్యింది. ఒకవేళ భారత్, పాక్ యుద్ధం ఆపడంలో ట్రంప్‌కు క్రెడిట్ ఇచ్చుంటే కచ్చితంగా మన దేశంపై ఒక్కశాతం కూడా టారిఫ్ విధించకపోయేవారేమో.
మొన్నటి దాకా నోబెల్ ప్రైజ్ కోసం ఆరాటపడిన ట్రంప్ ప్రపంచంలో అన్ని యుద్ధాలను తానే ఆపానంటూ ఢంకా భజాయించారు. ఇంత చేసినా నోబెల్ రాలేదన్న అసహనంలో ట్రంప్ తన నోటిని అదుపులో పెట్టుకోలేక ఏవేవో మాట్లాడుతున్నారనిపిస్తుంది. తాజాగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఘర్షణపై స్పందిస్తూ..‘పాక్, అఫ్గాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ఆపడం నా కు క్షణంలో పని.
తప్పెవరిదో పరిశీలిస్తా.. యుద్ధం ఆపుతా’ అంటూ బీ రాలు పలికారు. గత నెలలో తియాంజిన్‌లో షాంఘై సదస్సు సందర్భంగా భారత్, చైనా, రష్యా ఒకే వేదికపై కలిశాయి. ఈ ముగ్గురి కలయికను తట్టుకోలేని ట్రంప్.. చైనా కుట్రల వల్లే భారత్, రష్యా తమకు దూరమయ్యా యని ఆవేదన వెలిబుచ్చారు. అంతేకాదు తనపై పొగడ్తలు వచ్చినా దానికి పెడర్థాలు వెతకడం అలవాటు చేసుకున్న ట్రంప్ ఇటీవల టైమ్ మ్యాగజైన్‌పై నోరు పారేసుకున్నారు.
ఇటీవల టైమ్ మ్యాగజైన్ ట్రంప్ గురించి ప్రత్యేక కథనం ప్రచురించింది. అయితే తన కవర్ ఫోటోను సరిగ్గా వాడకపోవడం డొనాల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘టైం మ్యాగజైన్ కవర్‌పై ఉన్న నా ఫోటో చరిత్రలోనే అత్యంత చెత్తదనుకుంటా. అందులో నా జుట్టు కనిపించకుండా చేశారు. ఎందుకు ఇలా చేశారో సమాధానం చెప్పాలి’ అం టూ మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడ్డారు. ఇలా ట్రంప్ ప్రేలాపనలతో తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారనిపిస్తున్నది.






