26 April, 2026 | 3:12 AM

ఒక్కటవుతున్న ఈయూ

04-03-2025 12:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఐరోపాదేశాలన్నీ కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. వాషింగ్టన్‌లో మీడియా ప్రతినిధుల ఎదుటే జెలెన్‌స్కీని అవమానించే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, జెలెన్‌స్కీ సమావేశం మధ్యలోనే బైటికి వెళ్లిపోవడం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే ఫ్రాన్స్, కెనడాలాంటి కొన్ని యూరప్ దేశాలు జెలెన్‌స్కీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ లండన్‌లో ఐరోపా దేశాధినేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్,జర్మనీ, డెన్మార్క్, ఇటలీ సహా దాదాపు 20 దేశాల అధినేతలు హాజరయ్యారు. నాటో సెక్రటరీ జనరల్‌లాంటి కీలక అధికారులూ వచ్చారు. వీరితో పాటుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఐరోపా భద్రతకు నడుం బిగిద్దామని, తరానికో సారి తలెత్తే ఇలాంటి సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని స్టార్మర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకూ ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. సమావేశానికి హాజరైన నేతలంతా ఉక్రెయిన్‌కు బేషరతుగా మద్దతు పలకడం గమనార్హం. ఐరోపా దేశాల సమావేశానికి ముందు స్టార్మర్, మెక్రాన్‌లు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.

రష్యాతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళికపై కలిసి పని చేయాలని ముగ్గురూ నిర్ణయించారు. ఈ ప్రణాళికను అమెరికా ముందుంచాలని భావించారు. తాను పుతిన్‌ను నమ్మడం లేదని, అయితే ట్రంప్‌పై నమ్మకం ఉందని స్టార్మర్ పేర్కొన్నారు. ‘ఒకవేళ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్ రక్షణకు హామీ ఉండాల్సిందే. లేదంటే పుతిన్ మళ్లీ వస్తారు.

అందుకే ఒప్పందం అంటూ జరిగితే శాశ్వతంగా ఉండాలి. తాత్కాలిక ఒప్పందం వద్దనే వద్దు’ అని స్టార్మర్ తెగేసి చెప్పారు. హామీలను మీరకుండా పుతిన్‌ను అమెరికా నిలువరించడం కూడా అవసరమేనని అభిప్రాయపడ్డారు. 

మొత్తంమీద ఐరోపా దేశాల నేతల సమావేశంతో ఒక్క విషయం స్పష్టమయింది. ఐరోపా దేశాలతో మాటమాత్రం కూడా చర్చించకుండా ట్రంప్ ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రయత్నించడం ఆ దేశాలకు సుతరామూ నచ్చడం లేదు. అగ్రరాజ్యమైనప్పటికీ ఉక్రెయిన్ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న తమను సంప్రదించకుండా ట్రంప్ తాను అనుకొన్నది చేసేయడానికి యత్నించడం ఈ దేశాలకు గిట్టడం లేదు.

ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక సహాయం అందించడంలో అమెరికాదే సింహభాగం అయినప్పటికీ అదంతా కూడా గ్రాంట్ రూపంలో అందించిందే. అయితే బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్‌కు ఉదారంగా సాయం అందించిన మాట నిజం. ఇకపై అలా కుదరదని ట్రంప్ తెగేసి చెప్తున్నారు.ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీ కూడా తన స్వరం మార్చారు. ఐరోపా నేతలతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనని చెప్పారు.

‘నిర్మాణాత్మక చర్చలకోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తా. ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికీ సిద్ధమే’ నని స్పష్టం చేశారు. ఇదంతా చూస్తే నాలుగు స్తంభాల ఆట గుర్తుకు వస్తోంది. ఈ యుద్ధం ద్వారా వాణిజ్య ప్రయోజనాలతో పాటుగా ఎన్నికల హామీని నెరవేర్చుకోవాలని ట్రంప్ యత్నిస్తుంటే, ఎలాగైనా జెలెన్‌స్కీని యుద్ధ విరమణకు ఒప్పించడం ద్వారా ఉక్రెయిన్‌లో తాము ఆక్రమించుకున్న భూభాగాలపై ఆధిపత్యం కొనసాగించాలని పుతిన్ చూస్తున్నారు.

మరోవైపు ఉక్రెయిన్ భద్రత ఐరోపా దేశాలకు ముఖ్యం కావడంతో దానికి పూర్తి అండగా ఆ దేశాలు నిలుస్తున్నాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా సాయం గతంలా సాగదని అర్థం చేసుకున్న జెలెన్‌స్కీ అటు ఐరోపాతోను, ఇటు అమెరికాతోను చెడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఐరోపా ‘చరిత్ర కూడలి’లో ఉందని స్టార్మర్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం.