తాగునీటి ఇబ్బందులు
రెండు నెలలుగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
నాలుగు బోర్లు చెడిపోయినా పట్టించుకోని అధికారులు
ప్రైవేటు వ్యవసాయ బోరు మోటారు తో నెలకు 15000 చొప్పున నీటి కొనుగోలు
అధికార పార్టీ నాయకుల పక్షపాతం
నిధులు ఇవ్వడం చేయడం లేదంటూ టిఆర్‌ఎస్ నాయకులు ఆవేదన
జుక్కల్, మే 5 (విజయ క్రాంతి): ఎండాకాలంలో తాగునీటి కటకట తీవ్ర రూపం దాల్చడంతో జుక్కల్ మండలంలోని గుండూర్ గ్రామ ప్రజలు తాగునీటికి అరిగోసలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న నాలుగు బోరు మోటర్లు చెడిపోవడంతో వాటి మరమ్మతులకు కూడా నిధులు లేక జిపి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సర్పంచుల పదవీకాలం కంటే ముందు రెండేళ్లలో చేసిన అప్పులే అధికంగా ఉన్నాయని, ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధులు కార్యదర్శులకే సరిపోవంటూ వాపోతున్నారు.
ఈ గ్రామంలో సర్పంచ్ గా బిఆర్‌ఎస్ మద్దతుదారులైన అభ్యర్థి గెలవడంతో అధికార పార్టీలో ఉన్న నాయకులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారంటూ చెబుతున్నారు. ప్రస్తుతం నీటి కటకట తీవ్ర రూపం దాల్చడంతో గ్రామ సర్పంచ్ పంచాయతీ సిబ్బంది కలిసి ప్రైవేటు బోరుబావి నుంచి నీటిని ట్యాంకులు నింపేందుకు నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
గ్రామంలోని ట్యాంకులు నిండిన నీరు ఒకటే పూట వస్తున్నాయని అవి కూడా సరిపోవడం లేదంటూ పేర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాలకవర్గం గ్రామంలోని ఇతర బావుల వద్ద నుంచి వాటర్ ట్యాంకులో నీరు నింపుకుని తీసుకువచ్చి ఇతర పనులకు ఉపయోగపడే విధంగా నీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో మహిళలు, చిన్న, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా నీటి కోసం బారులు తీరుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళలు మహిళలు కొట్లాడుకుంటునట్లు పేర్కొంటున్నారు.
ఉదయం పొలం పనులకు వెళ్లే కూలీలకు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. తాగునీటికి కూడా అధికార పార్టీ నాయకులు పక్షపాతన ధోరణి అవలంబిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. గెలవకముందు ఓ మాట, గెలిచిన తర్వాత మాట మార్చే నాయకులతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇందులో ఎమ్మెల్యే తీరు ఏ విధంగా ఉన్నా గ్రామస్థాయి నాయకుల తీరు మాత్రం తాము అధికారంలో ఉన్నామన్న దురాహంకారంతో అభివృద్ధి పనులు కూడా సరిగా చేపట్టడం లేదని పేర్కొంటున్నారు. ఈ నీటి సమస్యకు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు వివరించిన పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ నీరు ఇప్పటివరకు నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే అప్పుడప్పుడు వస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు.
నీరు వచ్చినా రాకున్నా సంబంధిత ఏఈల వద్ద సంతకాలు సేకరించుకుని మిషన్ భగీరథ అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులకు కూడా ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ వారి పనితీరులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ఒక గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ ఫోన్ చేసిన మిషన్ భగీరథ అధికారులు ఫోన్ తీయడం లేదని సర్పంచ్ విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో నీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.






