స్వర మాంత్రికుడు
మిమిక్రీ శ్రీనివాస్.. ధ్వని అనుకరణ మాంత్రికుడు. వివిధ భాషాల్లో అనర్గళంగా మాట్లాడటమే కాదు.. వాళ్లను ఇమిటేట్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకోగలిగారు. ప్రముఖులు, పక్షులు, జంతువులు, వాహనాలు.. ఇలా ఒక్కటేమిటీ తన కంటపడినా దేన్ని వొదిలిపెట్టలేదు. ఆయన చేతిలో పడితే బొమ్మలు సైతం చకచక మాట్లాడుతాయి. ఆయనే వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు శ్రీనివాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. వందకుపైగా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి మిమిక్రీ సామ్రాట్‌గా బిరుదు పొందారు. మిమిక్రీ కళాకారుడిగా తన నాలుగు దశబ్దాల ప్రస్థానాన్ని విజయక్రాంతితో పంచుకున్నారు.
నాకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రద్శన చూశాను. ఆ ప్రదర్శన వరంగల్ జిల్లాలో జరిగింది. అది చూసినప్పుడు ఒక్క మనిషి ఇన్ని రకాలుగా మాట్లాడటం, ఇన్ని రకాల ధ్వనులు చెయ్యడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే నాకు పెద్ద ఇన్‌స్పిరేషన్. 1975లో మా నాన్న గారికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ అయింది. అప్పుడే అనుకున్నాను నేను వేణుమాధవ్ గారిని కలవాలని. ఆయన ఆచూకీ కోసం దాదాపు పది రోజులు అందరిని అడిగి తెలుసుకున్నాను. అలా చివరికి ప్రత్యేకంగా వెళ్లి కలిశాను. మిమిక్రీ మీద ఆసక్తితో నాకు వచ్చిన టాలెంట్‌ని ఆయన ముందు ప్రదర్శించాను.
అందుకు ఆయన ‘నీకు అద్భుతమైన టాలెంట్ ఉందయ్యా, నువ్వు ప్రాక్ట్టీస్ చేస్తే చాలా గొప్ప ఆర్టిస్టువి అవుతావు’ అని అన్నారు. ఆయన మాటలు నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. ఆ సందర్భంలోనే ఆయన నువ్వు పృధ్వీ రాజ్ కపూర్‌ను అనుకరిస్తే నీకు ఎన్నో వాయిస్‌లు వస్తాయి అని సలహా కూడా ఇచ్చారు. అలాగే ఎస్వీఆర్, ఎన్టీఆర్‌లను అనుకరించమని చెప్పారు. నాకు ఏం డౌట్ వచ్చినా ఆయనను వెళ్లి కలిసేది. అప్పట్లో ఆయన షేక్స్ స్పియర్ నాటకాలను చాలా అద్భుతంగా చెప్పేవారు. టేప్ రికార్డు కానీ రేడియో కానీ లేనిరోజుల్లో ఆయన షేక్స్ స్పియర్ నాటకాల్లో నుంచి సీన్స్ తీసుకొని చెప్పడం అద్భుతం అనుకోవాలి.
అలా ఆయన చెప్పినవన్నీ ప్రాక్టీసు చేస్తూ వచ్చాను. నా స్వరానికి దగ్గరగా ఉన్నా వాటి ని ముందుగా ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాను. కృష్ణమోహన్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను ‘శ్రీనివాస్ నువ్వు బాగానే చేస్తున్నావు కదా’.. స్టేజ్ మీద చేయొచ్చు కదా! అని ఎంకరేజ్ చేశాడు. నాకేమో మైక్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. వాసుదేవ్ గారు అని ఉండేవారు. ఆయనకు కట్టేలమండి ఉంటే.. దాన్ని తీసేసి అక్కడ వినాయకుడిని పెట్టారు.
అలా వినాయచవితిరోజు అందరి ముందు మైక్‌లో ఏదో చేయగలిగాను. దాని ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాం తో వినాయక మండపాల దగ్గరకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చేవాడ్ని. అలా దాదాపు 15 షోలు చేశాను. అలా చేయడం మూలంగా నాకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక మెల్లిగా కాలేజీలో.. ఇతర కాలేజీ ఫంక్షన్స్‌లో, శ్రీరామనవమికి, దసరాకు ప్రదర్శనలు చేస్తూ వచ్చాను. చాలామంది అనుకుంటున్నట్లుగా మిమిక్రీ అనేది పుట్టుకతో వచ్చే వరం. అందరికి రాదు అనేది తప్పు. ఇది పుట్టుకతో వచ్చేది కాదు నేర్చుకుంటే వస్తుంది. డ్యాన్స్, పెయింటింగ్స్‌లా మిమిక్రీ కూడా సాధన చేస్తే వస్తుంది.
మిమిక్రీలో శిక్షణ
1978లో ఖమ్మంలో ఎం.ఎన్ రాయ్ గారి ప్రదర్శన చూశాను. అది కొత్తగా అనిపించింది. బొమ్మ ఎలా మాట్లాడుతుంది అని అనుకున్నాను. అయితే అదే సంవత్సరం ఎం.ఎన్ రాయ్ గారు వరంగల్ వచ్చారు. ఆయన దగ్గరకు వెళ్లి “అయ్య నేను మీ ప్రదర్శన చూశాను.. నాకు మిమిక్రీ వస్తుంది. ఈ కళను కూడా నేర్చుకోవడం ఎలా” అని అడిగాను. దానికి ఆయన మిమిక్రీ చేస్తే తప్పకుండా ఇది వస్తుందని చెప్పారు. అలా వెంట్రిలాక్విజంలో ఎం.ఎన్ రాయ్ గారి వద్ద శిక్షణ తీసుకున్నాను. మిమిక్రీ కళాకారుడికి సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, భాషల పట్ల, రకరకాల సంస్కృతుల పట్ల, ధ్వని ఉత్పత్తికి సంబంధించిన అనేక పద్ధతుల పట్ల అవగాహన ఉండాలి. కృషితో సాధన చేస్తే మంచి మిమిక్రీ ఆర్టిస్టు అవ్వొచ్చు.
స్వరాల్లో తేడాలు..
స్పీచ్ మెకానిజమ్‌లో ముఖ్యంగా స్వరయంత్ర నిర్మాణం, స్వరయంత్ర రచన గురించి తెలుసుకోవాలి. పురుషుల కంఠాలు రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి బేస్.. రెండు బ్యారిటోనియన్. బేస్ అంటే ఎన్టీరామరావు, అమ్రీష్ పూరి, అమితాబ్ బచ్చన్ స్వరాలు. వాళ్ల స్వరాలు చాలా గంభీరంగా ఉంటాయి. అలాగే అక్కినేని నాగేశ్వర్, న్యూస్ రీడర్స్‌వి మౌళికమైన గొంతులుగా చెప్పుకోవచ్చు. గంభీరమైన స్వరాలను బ్యారిటోన్ అంటారు. మృదువైనా స్వరాలను బేస్ వాయిస్ అంటారు. ఈ రెండు తేడాలు తెలుసుకుంటే వాయిస్‌ను బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో అర్థం అవుతుంది. ఒక వాయిస్‌ను ఇమిటేట్ చేయడం వెనుక సంస్కృతిక నేపథ్యం ప్రధానంగా ఉంటుంది. ఎంత స్వరంతో.. ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
అబ్జర్వేషన్ చాలా అవసరం..
మిమిక్రీ కళాకారుడికి అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. ఏ ధ్వనిని అయినా నాలుక, పెదవులు, గొంతును ఉపయోగించి చెప్పవచ్చు. చదువుకున్నవారికి, చదువుకోనివారికి మాటాల్లో తేడాలు ఉన్నట్లే.. సంగీతం నేర్చుకుని పాడటానికి, నేర్చుకోకుండా పాడటానికి తేడాలు ఉన్నట్లే ఈ కళను కూడా సరైన శిక్షణ ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చు.
సాధన చేస్తే చాలు..
ఒక రాజకీయ నాయకుడిని అనుకరించాలని అనుకుంటే అతని ఉచ్ఛారణ, మాండలికం, వాచకం మీద పూర్తి నియంత్రణ ఉండాలి. వారు ఏ శృతిలో? ఎంత గతిలో? మాట్లాడుతున్నారో గమనించాలి. మనం కేవలం ఒక భాషకు చెందిన వారినే అనుకరిస్తే, ఇతర భాషల వారికి అర్థం కాదు. అలా కాకుండా మన చుట్టూ ఉండే ధ్వనుల మీద దృష్టిని కేంద్రీకరిస్తే.. ఏ భాషకు చెందిన వారినైనా మనం ఎంటర్ టైన్ చెయ్యగలుగుతాం. సాధారనంగా అంతా సినీ నటులను, రాజకీయ నాయకులను మాత్రమే అనుకరిస్తూ ఉంటారు. అలా మిమిక్రీ చేస్తే మన రాష్ట్రం వరకే పరిమితం అవుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాకా ధ్వనుల మీద సాధన చేసి నాకంటూ ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్‌ను ఏర్పరచుకున్నాను.
మర్చిపోలేని సంఘటన..
రాజస్థాన్‌లో బ్రహ్మకుమారీస్ వారు ఒకసారి ’ప్రపంచ శాంతి సమ్మేళనం’ అనే ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో ప్రపంచ శాంతి సమ్మేళనం జరుగుతోంది. నాకు హిందీ అంతంత మాత్రమే వచ్చు. కళ్యాణ్ జి. ఆనంద్ జి, అల్కా యగ్నిక్ వంటి ప్రముఖులతో పాటు, ఒక మూడువేల మంది ప్రదర్శనకు వచ్చారు. అక్కడ ఐదు నుంచి ఆరుగురికి తప్ప మీగతా ఎవరికీ తెలుగు రాదు. అప్పుడు అక్కడ ఉన్న పోస్టర్స్ చూసి, స్లొగన్స్ చూసి అప్పటికప్పుడు ప్రాక్టీసు చేశాను.
నాకు పది నిమిషాలే సమయం ఇచ్చారు. అది అయిపోగానే అక్కడి మధుబన్ ఇంచార్జ్ అయిన దాదీమా’ 40 నిమిషాలు ప్రదర్శన ఇవ్వండి’ అని మెజేజ్ పంపారు. భాష రాకపోయినా నేను చెయ్యగలిగాను. ఇదొక మర్చిపోలేని అనుభూతి. ఇదొక్కటే కాదు మా గురువుగారైన వేణుమాధవ్ గారిని 81లో రోటరీ క్లబ్ వాళ్ల ఫంక్షన్‌లో వారి కుటుంబం ఎదుటే ఇమిటేట్ చేశాను. ఇదొక మంచి అనుభవం. అలా నా జీవితంలో నాకు తెలియకుండా అనేకమంది ఆశీస్సులు, ప్రోత్సాహం వల్ల నేను ఒక మంచి కళాకారుడిగా నిలబడగలిగాను.
మాటల్లో వర్ణించలేను..
2013లో ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల్లో నా గురించి లెసన్ ఉంటుంది. అది చాలా గొప్ప అనుభూతి కలిగించింది. చిన్నప్పుడు నేను స్కూల్లో చదివినప్పుడు, ఏవేవో పాఠాలు ఉండేవి. ఇప్పుడు నన్ను నేను ఆ పుస్తకాల్లో చూడటం అనేది చాలా గొప్ప అనుభూతి. పుస్తకంలో రావడం అనేది నేను చేసిన కృషికి గుర్తింపుగా భావిస్తాను.
కామెడీ పేరుతో బూతులు..
మిమిక్రీ కళాకారుడు అంటే కేవలం రాజకీయ నాయకులు, సినిమా నటులను ఇమిటేట్ చేయడం మాత్రమే కాదు. ప్రకృతికి సంబంధించి ఒక సైక్లోన్, వర్షం పడటం, పిడుగులు పడటం ఇవన్నీ ఒకరకమైన శబ్దాలను కలిగి ఉంటాయి. ఇవి కాకుండా పశుపక్షాదులు ఎలా అరుస్తాయి అనేది మిమిక్రీలో చెప్పొచ్చు. అలాగే వాహనాల సౌండ్స్‌ని కూడా తీసుకొని చెప్పొచ్చు. అలాగే కొన్ని టీవీ ఛానల్స్‌లో మిమిక్రీ పేరుతో బూతులు చెప్పడం విన్నాను. ఇది మంచి పద్ధతి కాదు కదా. ఒక కళను చెడుగా ఉపయోగించడం అవుతుంది.
కళాకారులకు చెప్పేది ఒక్కటే..
ఒక ప్రదర్శనకు ఎంత అని అడిగితే.. నా రేట్ ఇంత అని ఫిక్స్ చేసుకోవద్దు. ఎందుకంటే.. చాలామంది తెలియక తప్పు చేస్తారు. నా రేట్ ఎక్కువ అని చెప్పుకుంటే నాకు గౌరవం ఎక్కువుటుందని అనుకుంటారు. అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కదా. ఏ కళాకారుడైన ఎవరన్నా ప్రోగ్రాం అడిగితే రేట్ ఫిక్స్ చేసుకోకండి. మీ బడ్జెట్‌ను బట్టి ఇవ్వండని అడిగితే సరిపోతుంది. వాళ్ల స్థాయికి తగ్గట్టు, వాళ్ల బడ్జెట్‌కు తగ్గట్టు ఇస్తారు. అది ఎంతైనా కావచ్చు. మన గురించి ఎదుటివాళ్లు ఏమనుకుంటున్నారనేది వాళ్లకు వదిలేయాలి. అలాగే కార్యక్రమ నిర్వహకులకు మనం బాగా కమ్యూనికేట్ చేయగలిగితే చాలు అవకాశాలు వాటి అంతట అవే వస్తాయి.
రూప
ఫొటోలు: వెంకట్ పులిపాటి






