పొట్లపల్లి చరిత్ర
శ్రీరామోజు హరగోపాల్ :
1996 ఆగస్టులో పొట్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రహరీ గోడ నిర్మించేందుకు పునాది తీయగా కాకతీయుల కాలం నాటి శివలింగం ఒకటి బయట పడింది. లింగం సమీపంలోనే పార, ఇతర వస్తువులు లభించాయి. ఇక్కడ బయటపడ్డ లింగానికి రేణుకా వాగు సమీపంలో ఆలయం నిర్మించారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయానికి గాలిగోపురం నిర్మించేందుకు 2012 జూన్ 18వ తేదీన ఆలయం ఎదుట గొయ్యి తవ్వగా ప్రాచీన గాజుబావి ఒకటి బయటపడ్డది. ఇది సుమారు 700ల ఏళ్ల క్రితం నాటిదని పురావస్తుశాఖ అధికారులు తేల్చారు.
పొట్లపల్లిలో ఒకరు ఇంటిపనుల్లో భాగంగా తవ్వుతుంటే శివాలయంలో లింగం ప్రతిష్టించే పానవట్టం ఒకటి బయటపడ్డట్లు వార్త వచ్చింది. బయటపడ్డ పానవట్టం ఐదు అంచుల గుండ్రని పానవట్టం. ఈ శైలి పానవట్టాలు కళ్యాణీ చాళుక్యులనాటి శివాలయాలలోనే ఎక్కువగా అగుపిస్తాయి. అయితే ఈ పానవట్టాల మీద ప్రతిష్టించే లింగాలు కాకతీయశైలి సమలింగాలు కావు. వీటికి బ్రహ్మ, విష్ణు, రుద్ర భాగాలుండవు. ఒక లింగభాగమే ఉంటుంది. నర్మదానదిలో దొరికే బాణలింగాలుగా పిలిచే గుండ్రని అండాకారపు రాళ్లలో ఒకటి లింగంగా ఈ పానవట్టం మీద అమరుస్తారు. ఇప్పుడు పానవట్టం దొరిగింది. అది ఆలయం నుంచి తీసి బయటపడేసింది కాకపోతే బాణలింగం కూడా అక్కడే దొరకపోవచ్చు.
కరీంనగర్ జిల్లా శాసనసంపుటిలో 16వ శాసనం (42వ పేజీ) పొట్లపల్లి శాసనం. ఈ శాసనంలో క్రీ.శ. 1066వ సంవత్సరం (శక సంవత్సం,988, చైత్రపౌర్ణిమ) మార్చి 14న, చంద్రగ్రహణం సందర్భంగా అక్కడి పంచమఠాలలోని నకరేశ్వర దేవరకు తపోధనుడు మల్లప్ప(గురువు) అగ్రహారం కొరకు ద్రవ్యం మొదలైన సమభోగాలకు, త్రిభోగాభ్యంతర సిద్ధిగా, సర్వపరిహారం (అన్ని పన్నుల రద్దు)గా ధ్వారాపూర్వకరంగా ఐదు కొట్టరాడ్ల రాటణాన్ని కళ్యాణీ చాళుక్యచక్రవర్తి త్రైలోక్యమల్ల దేవుని పాలనాకాలంలో అతని మహాసామంతుడు పొట్లపల్లి గోవ(అధికారి) రేగొండ చంద్రయ్య రసర్ (రాజు) దానం చేశాడు.
త్రైలోక్యమల్లదేవుని శాసనాలలో పంచమఠాల ప్రస్తావన వస్తుంది. ఈ పంచమఠాలు కాలాముఖమఠాలు కావచ్చు. పొట్లపల్లి గురువు మల్లప్పకిచ్చిన అగ్రహారం. ఈ అగ్రహారంలో నీటి వ్యవస్థ కొరకు మహాసామంతుడు రేగొండ చంద్రయ్య రసర్ నీరుతోడే యంత్రం రాటనాన్ని దానం చేశాడు. అగ్రహారానికి పన్నుల బాధలేకుండా చేశాడు.
పొట్లపల్లి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండంలోని గ్రామం. ఈ గ్రామానికో వాగుంది. దాన్ని రేణుకావాగు అని పిలుస్తారు. ఊరి బయట నాగశిలలున్నాయి. పోషమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మదేవత, పరశురాముడికి గుడులున్నాయి. ఊరిలో మల్లన్న గుడి, సీతారామచంద్రస్వామి గుడి శివాలయాలున్నాయి. అప్పుడప్పుడు గ్రామంలో పునాదుల కోసమో, పనుల కోసమో తవ్వినప్పుడల్లా ఏదో ఒక విగ్రహమో, గుడి స్తంభాలో దొరుకుతుంటాయి.
పొట్లపల్లి గ్రామానికి దగ్గరలో ఒక గుట్ట ఉంది. దీన్ని ఎల్లమ్మగుట్ట అని పిలుస్తారు స్థానికులు. గుట్టపాదంలో బంతిరాళ్ళ సమాధులు విరివిగా కనిపిస్తాయిక్కడ. వీటిని పరిశీలించినప్పుడు ఇవి పెదరాతియుగం సమాధులు అని తెలుస్తుంది.
2012, జూలై 24న ప్రముఖ చరిత్రకారుడు, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైకిషన్, గుజరాత్‌లోని బరోడా విశ్వవిద్యాలయ రీసెర్చ్ స్కాలర్‌లు స్మతి చరణ్, రిషబ్, బ్రిటన్‌లోని ఓ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ తత్‌గత్, జిల్లా చరిత్రకారుడు నాగేంద్రశర్మ పొట్లపల్లి సమాధులపై అధ్యయనం చేశారు. ఇవి క్రీ.పూ.2500 నాటివిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ గుట్టవద్ద బండరాళ్లను పరిశీలించి ఒకప్పుడు ఇక్కడ అగ్ని పర్వతం ఉండేదని, దాని లావాతోనే ఇక్కడ రాళ్లు పొరలుగా మారాయని చెబుతున్నారు. అయిదు తలలతో నాగుల విగ్రహాలు నాగదేవతను ఆరాధిస్తూ ఆర్యులు ఏర్పాటు చేసిన నాగులమ్మల విగ్రహాలు ఎల్లమ్మ గుట్ట దిగువ ప్రాంతంలో ఉన్నాయి.
అయిదు తలలతో ఉన్న నాగుల విగ్రహాలు ఏడు ఇక్కడ ప్రతిష్టింపబడ్డట్టు తెలుస్తోంది. ఆ కాలంలో నాగజాతి ఇక్కడ నివసించేదని, ఈ కారణంగానే పొట్లపల్లి నాగపట్నంగా పిలువబడినట్లు జిల్లాకు చెందిన చరిత్రకారుడు డాక్టర్ మలయశ్రీ వెల్లడించారు. అనంతరం ఇక్కడ నివసించిన ద్రావిడులు నాగజాతిని అంతం చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారని, దీనికి గుర్తుగా ద్రావిడులు నాగజాతిని అంతం చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారని, దీనికి గుర్తుగా ద్రావిడులు గ్రామ చెరువు సమీపంలో నాగుపామును కత్తితో రెండుగా చీల్చిన శిల్పం ఏర్పాటు చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
క్రీ.పూ.230 నుంచి క్రీస్తు శకం 100 వరకు శాతవాహనుల పరిపాలనలో ఈ గ్రామం ఉండేదని అంటున్నారు. అప్పుడు పొట్లపల్లిలో సుమారు 400ల బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవట. వారు నివసించిన స్థలాన్నే ఇప్పుడు బ్రాహ్మణుల దిబ్బగా పిలుస్తుండటం గమనార్హం.
శాతవాహనుల అనంతరం కళ్యాణీ చాళుక్యులు ఇక్కడ పరిపాలన చేశారని, వారు వేయించిన పలు శాసనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని చెబుతున్నారు. రెండో ప్రోలరాజు, రెండో బేతరాజులు పొట్లపల్లిని పరిపాలించారు. వీరి పాలనలో ఇక్కడ పంచమఠ స్థానాలు ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం. అనంతరం పొట్లపల్లి రాష్ట్రకూటుల పాలనలోకి వెళ్లింది. ఇక్కడ ఉన్న శాసనాల్లో రాకొండ చంద్రయ్య అనే వ్యక్తికి త్రైలోక్య చక్రమల్లు అనే చక్రవర్తి క్రీస్తు శకం 1066 సంవత్సరం ఆదివారం రోజున దానాలు చేసినట్లు చెక్కబడి ఉన్నట్టు చెబుతున్నారు.
101 శివాలయాల చరిత్ర మరో శాసనంలో మల్లిప్ప అనే వ్యక్తికి రాటం (మోట బొక్కెన) దానమిచ్చినట్లు ఉంది. ఈ శాసనాలు కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్నట్లు డాక్టర్ మలయశ్రీ విశ్లేషించారు. కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ గ్రామంలో 101 శివాలయాలు నిర్మించారని, వాటిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ లింగాన్ని పోలిన లింగాలే ఉండేవని చరిత్రకారులు అంటున్నారు. పొట్లపల్లి నుంచి పందిల్ల వరకు ప్రతి శివరాత్రికి తాటాకుల పందిళ్లు వేసి ఉత్సవాలు నిర్వహించేవారు. ఇందువల్లే పందిల్ల గ్రామానికి ఆ పేరొచ్చింది.






